Telangana: వంట గ్యాస్,పెట్రోల్ నిల్వలపై భయం వద్దు: పౌరసరఫరాల శాఖ
Civil Supplies Department: తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ , వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. గత కొద్ది రోజులుగా ఇంధన సరఫరా నిలిచిపోతుందనే వదంతులు రావడంతో హైదరాబాద్‌లోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందిస్తూ.. ప్రజలు అనవసరంగా భయాందోళనలకు గురికావద్దని కోరారు.
రిఫైనరీల నుండి పెట్రోల్ , డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని, ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. కేవలం తప్పుడు ప్రచారాల వల్లే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద అకస్మాత్తుగా రద్దీ పెరిగిందని, నిల్వలు ఉండవనే భయంతో ముందస్తు కొనుగోళ్లు చేయడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు వివరించారు.
ఇవి కూడా చదవండి
నిల్వలు పుష్కలం:
తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ కూడా ఇంధన కొరత లేదని ప్రకటించింది. హెచ్‌పీసీఎల్ (HPCL), ఐవోసీఎల్ (IOCL), , బీపీసీఎల్ (BPCL) వంటి సంస్థల వద్ద తగినంత స్టాక్ ఉందని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని డీలర్లు స్పష్టం చేశారు.
నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష:
రాష్ట్రంలో ఇంధన, గ్యాస్ సిలిండర్లు , యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ భేటీలో అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వదంతులు వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి








