India: ఎల్పీజీ సరఫరాలో కొత్త ట్విస్ట్.. ఇకపై 10 కిలోల గ్యాస్ మాత్రమే!
LPG: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారతీయ వంటగదిపై ప్రభావం చూపబోతోంది. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో, దేశంలో వంటగ్యాస్ (LPG) కొరత రాకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. గృహ అవసరాలకు వాడే సిలిండర్ బరువును తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
14.2 కిలోల నుంచి 10 కిలోలకు: ప్రస్తుతం మనం వాడుతున్న 14.2 కేజీల సిలిండర్ స్థానంలో, ఇకపై 10 కేజీల గ్యాస్‌ను మాత్రమే నింపి పంపిణీ చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. పాత సిలిండర్లలోనే తక్కువ పరిమాణంలో గ్యాస్ నింపి సరఫరా చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సరఫరా సజావుగా సాగేందుకే: దేశవ్యాప్తంగా ఎల్పీజీ పంపిణీలో అంతరాయం కలగకుండా చూసేందుకు ఈ ‘తక్కువ బరువు-ఎక్కువ మందికి’ వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. 10 కేజీల సిలిండర్ సగటున ఒక నెలకు వస్తుందని అంచనా వేస్తున్నారు.
హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు: భారత్ తన ఎల్పీజీ అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. గ్యాస్ రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరా గొలుసు దెబ్బతింటోంది.
ధర , నిబంధనలు: ఒకవేళ బరువు తగ్గిస్తే, దానికి అనుగుణంగా ధరను కూడా తగ్గించాల్సి ఉంటుంది. అలాగే సిలిండర్లపై స్పష్టమైన లేబుల్స్ వేయడంతో పాటు రెగ్యులేటరీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే, ఈ మార్పులపై ప్రభుత్వం లేదా చమురు సంస్థల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.








