Iran India Talks : గ్యాస్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు కేంద్రం కసరత్తు.. ఇరాన్‌తో భారత్ కీలక చర్చలు
LPG : దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. గ్యాస్ లభ్యతను పెంచేందుకు , బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌కు రావాల్సిన 8 ఎల్పీజీ (LPG) ట్యాంకర్లు ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిపోయాయి. వీటిని సురక్షితంగా జలసంధి దాటించేందుకు భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందుకు ఇరాన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది, త్వరలోనే ఈ ట్యాంకర్లు భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది.
మరోవైపు, యుద్ధ వాతావరణం నుంచి రెండు చమురు నౌకలు చాకచక్యంగా బయటపడ్డాయి. వీటిలో ఒకటి ఇప్పటికే భారత్‌కు చేరుకోగా, మరొకటి రెండు రోజుల్లో రానుంది. ఈ రెండింటి ద్వారా సుమారు 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు అందుబాటులోకి రానుంది.

తీవ్రంగా గ్యాస్ సెగ.. మూతపడుతున్న హోటళ్లు:
వంటగ్యాస్ కొరత ప్రభావం వాణిజ్య రంగంపై తీవ్రంగా పడుతోంది. పలు నగరాల్లో కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్ల నిర్వహణ భారంగా మారింది. కేరళలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది, అక్కడ ఇప్పటికే 40 శాతం హోటళ్లు మూతపడ్డాయి. ప్రత్యామ్నాయ ఇంధనం లేకపోవడంతో వ్యాపారాలు నిలిపివేస్తున్నట్లు యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో ఇంధన కొరత లేదని కేంద్రం భరోసా ఇస్తున్నప్పటికీ, గ్యాస్ ఏజెన్సీలు , పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారులు తీరుతుండటం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి








