మహానాడు మా ఇష్టం, మీకెందుకు..?
తెలుగుదేశం(TDP) పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘మహానాడు’ నిర్వహణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు(Mahanadu) ఎక్కడ నిర్వహించుకోవాలనేది తమ పార్టీ అంతర్గత విషయమని, దీనిపై ఇతర పార్టీల నేతలు విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. మహానాడును ఏటా ఒక జిల్లాలో నిర్వహించడం పార్టీ సంప్రదాయమని గుర్తు చేశారు.
ఈ ఏడాది నెల్లూరులో నిర్వహించాలని తాము చేసిన అభ్యర్థన మేరకే అధిష్టానం ఇక్కడ ఏర్పాట్లు చేసిందని ఆయన వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో మహానాడును నిర్వహించడం తమకు గర్వకారణమని, దీనిపై అనవసర రాద్ధాంతం చేయవద్దని సూచించారు. సొంత పార్టీ కార్యక్రమాల గురించి చర్చించుకోలేని వైసీపీ నేతలు, టీడీపీ అంతర్గత విషయాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని నారాయణ ధ్వజమెత్తారు. మహానాడు అనేది ఒక పండుగలా జరుగుతుందని, దీనిపై విమర్శలు చేసే స్థాయి వైసీపీ నేతలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం రాజకీయ ఉనికి కోసమే వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. నెల్లూరులో జరగబోయే మహానాడుకు భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలిరానున్నారని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇతర పార్టీల నేతల మాటలను ఎవరూ పట్టించుకోరని, మహానాడు విజయవంతం కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మహానాడు మే 27, 28, 29 తేదీలలో నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల IFFCO కిసాన్ SEZ (IKSEZ) మైదానంలో జరగనుంది. ఇందుకోసం సుమారు 150 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ మూడు రోజుల ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు కలిపి సుమారు 5 నుండి 7 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.







