శాంతి చర్చలకు కీలక షరతులు..!
పశ్చిమాసియా సంక్షోభ నివారణలో భాగంగా అమెరికా-ఇరాన్ జరిపిన తొలివిడత చర్చలు విఫలమయ్యాయి. దీంతో అమెరికా .. ఇరాన్ నౌకలను బ్లాకేడ్ చేయడం మొదలు పెట్టింది. ఇది ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు చేటు చేసేదే అని చెప్పవచ్చు. ఈ సమయంలో ఇరాన్ యుద్ధానికి సిద్ధం అంటూనే.. చర్చలకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపింది. దీంతో మరోసారి చర్చల ప్రక్రియ తెరపైకి వచ్చింది.
ఈ దశలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కీలక ప్రతిపాదనలు చేశారు. చర్చలు పునఃప్రారంభించాలంటే రెండు కఠినమైన షరతులను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లో జరగబోయే తదుపరి విడత చర్చలకు ముందే ఈ నిబంధనలను తెరపైకి తెచ్చింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు రెండు రోజుల్లో పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనప్రాయంగా తెలిపినప్పటికీ, ఈ కొత్త షరతులు సందిగ్ధతకు దారితీస్తున్నాయి.
అమెరికా పెట్టిన మొదటి షరతు.. హర్మూజ్ జలసంధిని ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా తెరవడం. ఇరాన్ గనుక తమ నౌకలు, ట్యాంకర్ల రాకపోకలను అడ్డుకుంటే, తాము కూడా ఇరాన్ నౌకలను కదలనివ్వబోమని అమెరికా స్పష్టం చేసింది. ప్రతిచర్య తప్పదనే సంకేతాలను బలంగా పంపింది.
ఇవి కూడా చదవండి
ఇక రెండో షరతుగా.. చర్చలకు వచ్చే ఇరాన్ ప్రతినిధి బృందానికి ఒప్పందాలను ఖరారు చేసే పూర్తి అధికారం ఉండాలని అమెరికా పట్టుబడుతోంది. ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సహా ప్రభుత్వంలోని అన్ని కీలక విభాగాల ఆమోదం పొందే అధికారం ఆ బృందానికి ఉండాలని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్‌లో కుదిరే ఏ ఒప్పందానికైనా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులందరి సమ్మతి ఉండాలని కోరుకుంటోంది.
ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు
అమెరికా ఈ షరతులు పెట్టడం వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వంటి రాజకీయ నాయకత్వానికి, ఐఆర్‌జీసీకి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్లు కథనాలు వస్తున్నాయి. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన చర్చల్లో అమెరికాకు సమాధానాలు ఇవ్వకుండా రాజకీయ ప్రతినిధి బృందాన్ని ఐఆర్‌జీసీకి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు అడ్డుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో దేశాన్ని పూర్తి ఆర్థిక పతనం నుంచి కాపాడాలని అధ్యక్షుడు పెజెష్కియాన్ పార్లమెంట్ స్పీకర్‌ను కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంతర్గత గందరగోళం కారణంగానే ఒప్పందం చేసుకునే పూర్తి అధికారంతో వస్తేనే చర్చలుంటాయని అమెరికా స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి








