రెండోదశ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్… అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ హైకమాండ్ కు అందించారు. ఇరాన్ నుంచి వచ్చేప్రతిపాదనలు అమెరికాకు అందించనున్నారు. ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్లో చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇటీవలే యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ కూడా సంకేతాలు ఇచ్చారు.
అయితే ఈ చర్చలు అసలు ప్రారంభమవుతాయా..? ప్రారంభమైనా అవి సత్ఫలితాలిస్తాయా అన్న అంశంపై మాత్రం ప్రపంచవ్యాప్తంగా అనుమానాలున్నాయి. ఎందుకంటే.. కీలకమైన ఇరాన్ అణుశుద్ధి ప్రక్రియను ఎంతకాలం ఆపాలనే విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఏకాభిప్రాయం లేదు. కొందరు ఐదేళ్లు ఆపాలని, మరికొందరు 20 ఏళ్లు ఆపాలని చెబుతున్నారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న ప్రధాన విభేదం. మరొక ప్రధాన అంశం ఇరాన్ వద్ద ఉన్న 440 కిలోగ్రాముల యురేనియం నిల్వ. ఈ నిల్వను మరో దేశానికి తరలించడం లేదా శుద్ధి స్థాయిని తగ్గించడం వంటి పలు మార్గాలు పరిశీలనలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకారం.. ఇప్పటికే ఇరాన్ 60% స్వచ్ఛత వరకు 440.9 కిలోగ్రాముల (972 పౌండ్ల) యురేనియం నిల్వను శుద్ధి చేసింది. ఇది 90% ఆయుధ-స్థాయి స్వచ్ఛతకు చేరడానికి ఒక చిన్న అడుగు దూరంలో ఉంది.ఒకవేళ ఇరాన్ తన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకుంటే, ఆ నిల్వతో 10 అణ్వాయుధాల వరకు తయారు చేయగలదని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ ఏపీకి ఇచ్చిన ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ఐఏఈఏ మార్గదర్శకాల ప్రకారం.. ఇంత అధికంగా శుద్ధి చేసిన అణు పదార్థాన్ని సాధారణంగా ప్రతి నెల తనిఖీ చేయాలి.
అయితే లెబనాన్ లో పదిరోజుల సీజ్ ఫైర్ కాస్త .. చర్చల ప్రక్రియకు సానుకూలాంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. ఇరాన్ సైతం తమ డిమాండ్లలో దీన్ని కూడా ప్రస్తావించింది. మరోవైపు..
ఇతర అంశాల్లో వెనకడుగు వేసేలా కనపడడం లేదు. ఇటువైపేమో రెండోదశ చర్చల జరగకపోయినా, అవి మళ్లీ విఫలమైనా భీకర యుద్ధం తప్పదని ఇప్పటికే ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది.








