Hormuz: హర్మూజ్ విషయంలో అమెరికా చేతులెత్తేసిందా..?
ఇరాన్ యుద్ధంలో సాధించాల్సిన లక్ష్యాలను సాధించేశామని ఇప్పటికే ట్రంప్ యంత్రాంగం చెబుతోంది. ఇరాన్ నావీ, ఎయిర్ ఫోర్స్ లు, ఆర్మీని తీవ్రంగా దెబ్బతీశామంటోంది. అంతేనా.. ఇరాన్ అణ్వాయుధాలను కూడా చాలా వరకూ దెబ్బతీశామని చెబుతోంది. అయితే పరిస్థితులు చూస్తే మాత్రం అంతలా కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పోరాడుతున్నా.. ఇరాన్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. సరికదా.. తగ్గేదేలేదంటూ సవాల్ విసురుతోంది.
ఇక ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి అయిన హర్మూజ్ (Hormuz)జలసంధి తెరిపించేందుకు ట్రంప్ ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఆ పని సజావుగా జరగడం లేదు. దీనికి తోడు పోనీ నావీని మోహరిద్దామంటే.. సముద్రంలోని అండర్ సీమైన్స్.. వాటికి అడ్డంకులుగా మారాయి. ఆర్మీని దించుదామంటే.. ఇరాన్ భూతల యుద్ధంలో ఆరితేరింది. ఈ పరిస్థితుల్లో పొరపాటున అమెరికా సైన్యం కనుక.. ఇరాన్ లో అడుగు పెడితే.. అది మరింత భీకరంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
హర్మూజ్ జలసంధిని తిరిగి పూర్తిగా తెరిపించేందుకు చేపట్టాల్సిన సైనిక ఆపరేషన్ చాలా సంక్లిష్టమైనదని, దానికి తాము ఆశించిన నాలుగు నుంచి ఆరు వారాల కంటే ఎక్కువ సమయం పడుతుందని ట్రంప్ పాలనా యంత్రాంగం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
అందుకే ఆ లక్ష్యాన్ని పక్కనపెట్టి ఇరాన్ నౌకాదళాన్ని బలహీనపరచడం, క్షిపణి నిల్వలను ధ్వంసం చేయడం, రక్షణ పరిశ్రమతో పాటు అణు సామర్థ్యాలను పరిమితం చేయడం వంటి ప్రధాన సైనిక లక్ష్యాలపైనే అమెరికా దృష్టి సారించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లక్ష్యాలు పూర్తయిన తర్వాత సైనిక చర్యలను తగ్గించి, దౌత్య మార్గాలపై ఎక్కువగా ఆధారపడాలని భావిస్తున్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. ప్రస్తుత సైనిక లక్ష్యాలను కొన్ని వారాల్లోనే పూర్తి చేయవచ్చని తెలిపారు. ఆ తర్వాత జలసంధిని తెరవడం అనేది ఇరాన్ ఇష్టానికే వదిలేస్తామని, లేదంటే ఇతర దేశాల కూటమి నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించే బాధ్యత తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. అయితే, హర్మూజ్ ప్రాముఖ్యతపై ట్రంప్ గతంలో మిశ్రమ సంకేతాలు ఇచ్చారు. జలసంధిని తెరవకపోతే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై బాంబు దాడులు చేస్తామని ఒకసారి హెచ్చరించగా, మరోసారి దాని భద్రత అమెరికా కంటే ఇతర దేశాలకే ఎక్కువ అవసరమని వ్యాఖ్యానించారు.
హర్మూజ్ జలసంధి మూసివేత ఇప్పటికే ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. ప్రపంచంలోని మొత్తం చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. సరఫరాలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొని, ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లను దాటింది. ఎరువులు, సెమీకండక్టర్ల తయారీలో వాడే హీలియం వంటి ఇంధన ఆధారిత వస్తువుల కొరత అనేక దేశాల్లో కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి








