Hormuz Toll: నౌకల నుంచి రూ.19 కోట్ల టోల్ వసూలు చేస్తున్న ఇరాన్!
పశ్చిమాసియాలో రోజుకో మలుపు తిరుగుతున్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) కేంద్రంగా అమెరికా, ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారస్థాయికి చేరుకుంటోంది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్‌కు విధించిన డెడ్‌లైన్‌ను అమెరికా మరో 10 రోజుల పాటు పొడిగించడం, నౌకల నుంచి ఇరాన్ భారీగా టోల్ (Hormuz Toll) వసూలు చేయడం, అలాగే ఇరాన్ సుప్రీంలీడర్పై ట్రంప్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఈ యుద్ధంలో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
డెడ్‌లైన్ పొడిగింపు
ఇరాన్ ఎనర్జీ సదుపాయాలపై దాడులు చేయకుండా ఆ దేశం పెట్టిన అభ్యర్థన మేరకే డెడ్‌లైన్‌ను ఏప్రిల్ 6వ తేదీ రాత్రి 8 గంటల వరకు పొడిగించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఇరాన్ తనను వారం రోజుల గడువు అడిగిందని, కానీ తాను మాత్రం 10 రోజులు ఇచ్చానని తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు సజావుగానే సాగుతున్నాయన్న ఆయన.. ఇరాన్ ఇకనైనా తన అణ్వాయుధ, మిసైల్ కార్యక్రమాలను విడిచిపెట్టి శాంతి మార్గంలో నడవాలని హెచ్చరించారు.
అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ యంత్రాంగం తీవ్రంగా ఖండించింది. తాము అమెరికాను ఎలాంటి గడువూ అడగలేదని, వాషింగ్టన్ ప్రతిపాదించిన 15 పాయింట్ల శాంతి ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని టెహ్రాన్ వర్గాలు తేల్చిచెప్పాయి. ట్రంప్ (Donald Trump) కేవలం తన పరువు కాపాడుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, నేరుగా యుద్ధం నుంచి నెమ్మదిగా వెనక్కి తగ్గుతున్నారని ఎద్దేవా చేశాయి.
ఇవి కూడా చదవండి
రూ. 19 కోట్ల ‘టోల్ ట్యాక్స్’..
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే విదేశీ నౌకల నుంచి ఇరాన్ భారీ స్థాయిలో టోల్ ట్యాక్స్ (Hormuz Toll) వసూలు చేస్తుండటం సంచలనంగా మారింది. ఒక్కో నౌక నుంచి సుమారు 2 మిలియన్ డాలర్లు (రూ. 18.8 కోట్లు) వసూలు చేస్తున్నారు. యుద్ధ ఖర్చుల భారాన్ని తట్టుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది ఇరాన్ బలాన్ని ప్రతిబింబిస్తుందని ఆ దేశ ఎంపీ అలాదీన్ బోరోజెర్డి సమర్థించుకున్నారు. మరోవైపు, ఈ జలసంధిని తెరిపించేందుకు అమెరికా ప్రతిరోజూ 2 బిలియన్ డాలర్ల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని యూఎస్ సెనేటర్ క్రిస్ మర్ఫీ స్వపక్షంపైనే విరుచుకుపడ్డారు. అసలు ఈ సమస్యను సృష్టించిందే ట్రంప్ ప్రభుత్వమని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుప్రీంలీడర్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా, ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మోజ్తాబా ఖమేనీపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అమెరికా నిఘా సంస్థ (CIA) నివేదికల ప్రకారం మోజ్తాబా ఒక ‘గే’ (Gay) అని ఆయన వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తూ, స్వలింగ సంపర్కానికి ఏకంగా మరణశిక్ష విధించే దేశమైన ఇరాన్లో.. సాక్షాత్తూ ఆ దేశ సుప్రీంలీడర్పై అమెరికా అధ్యక్షుడు (Donald Trump) ఈ తరహా వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.
‘థాంక్యూ ఇండియా’ క్షిపణులు
ఈ సంక్షోభ సమయంలో తమకు మద్దతుగా నిలుస్తున్న దేశాలకు ఇరాన్ (Hormuz Toll) వినూత్న రీతిలో కృతజ్ఞతలు చెబుతోంది. ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4’లో భాగంగా ఇజ్రాయెల్‌పై ప్రయోగిస్తున్న 83వ దఫా క్షిపణులపై ‘థాంక్యూ టు పీపుల్ ఆఫ్ ఇండియా’ (భారత ప్రజలకు ధన్యవాదాలు), అలాగే జర్మనీ, పాకిస్థాన్, స్పెయిన్ దేశాల పేర్లను రాస్తూ ప్రయోగిస్తుండటం గమనార్హం.
మరోవైపు, ఒకపక్క ఇరాన్ క్షిపణుల మోత మోగిస్తుంటే, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సైనికుల కొరత మునుపెన్నడూ లేనంత స్థాయికి చేరిందని, తక్షణమే సైనిక నిర్బంధ సేవ (Conscription) చట్టాలు కఠినతరం చేయకపోతే ఇజ్రాయెల్ ఆర్మీ దానంతటదే కుప్పకూలుతుందని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఇయాల్ జమీర్ సొంత క్యాబినెట్‌ను హెచ్చరించడం పశ్చిమాసియాలో మారుతున్న యుద్ధ సమీకరణాలకు అద్దం పడుతోంది.
ఇవి కూడా చదవండి








