హెచ్-1బీ వీసాపై ఫెడరల్ కోర్టు తీర్పును స్వాగతించిన ప్రవాస భారతీయులు..!
హెచ్-1బీ వీసా ఫీజుపై ట్రంప్ నిర్ణయాన్ని కొట్టివేస్తూ.. ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికాలోని ప్రవాస భారతీయ సంఘాలు (Indian diaspora groups) హర్షం వ్యక్తం చేశాయి. వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.
ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (FIIDS)కి చెందిన స్ట్రాటజీ చీఫ్ ఖండేరావ్ కంద్ దీనిపై మీడియాతో మాట్లాడారు. హెచ్-1బీ వీసా రుసుముపై ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ ఆధారిత వలసల వ్యవస్థపై స్థిరత్వాన్ని ఇది తిరిగి తీసుకొస్తుందన్నారు. అమెరికాలో సాంకేతిక, ఆరోగ్య సంరక్షణ, అధునాతన తయారీ రంగాల వృద్ధికి ప్రపంచంలోని ప్రతిభావంతులు అవసరమన్నారు. విధానపరమైన మార్పులు, చట్టబద్ధమైన అధికారం, ఆర్థిక గణాంకాలపై ఆధారపడి ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా కోర్టు తీర్పుపై హర్షాతిరేకాలు తెలియజేశారు. అయితే, ట్రంప్ (Donald Trump) యంత్రాంగం ఈ విషయాన్ని ఇంతటితో ముగుస్తుందా.. లేదా అనే దానిపై అనుమానం వ్యక్తంచేశారు. ట్రంప్ యంత్రాంగానికి, న్యాయవ్యవస్థలకు మధ్య ఇటీవల జరిగిన పలు వివాదాలను ఆయన ప్రస్తావించారు. చట్టానికి విరుద్ధంగా.. విధానపరమైన అంశాలతో అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాదారులకు మరిన్ని అడ్డంకులు సృష్టించవచ్చని హెచ్చరించారు.
హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ గతేడాది సెప్టెంబరులో ట్రంప్ తీసుకొన్న నిర్ణయం సంచలనం సృష్టించింది. ట్రంప్ నిర్ణయాన్ని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో సహా పలు డెమోక్రటిక్ రాష్ట్రాలు కోర్టులో సవాల్ చేశాయి. ఈక్రమంలో బోస్టన్లోని ఫెడరల్ కోర్టు ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్ధమైనదని ప్రకటించింది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోలేరని స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పుపై ట్రంప్ యంత్రాంగం అప్పీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.








