హెచ్-1బి వీసాపై లక్ష డాలర్ల ఫీజు చెల్లదు…ఫెడరల్ కోర్టులో ట్రంప్ కు షాక్..!
అమెరికా వెళ్లాలనుకునే వారికి తీపి కబురు. హెచ్ -1బీ వీసాకు అప్లై చేసుకోవాలంటే లక్ష డాలర్లు చెల్లించాలని ట్రంప్ ఆదేశాన్ని.. ఆదేశ ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమైనదని .. కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు ఎలాంటి పన్ను విధించలేరని బోస్టన్ లో ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది.దీంతో.. అమెరికాలో ఉద్యోగాలు ఆశిస్తున్న భారతీయ టెక్ నిపుణులతో పాటు ఇతర విదేశీ నిపుణులకు భారీ ఊరట లభించింది.
ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో ప్రకటించిన ఈ ఫీజును సవాలు చేస్తూ డెమొక్రాటిక్ పార్టీకి చెందిన 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టులో దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సొరోకిన్ కీలక తీర్పు ఇచ్చారు. “చట్టం ద్వారా కాంగ్రెస్ అధికారం ఇస్తే తప్ప, పన్ను విధించే అధికారం అధ్యక్షుడికి లేదు. హెచ్-1బి పిటిషన్లపై విధించిన ఈ ఫీజు కాంగ్రెస్ అనుమతి లేని పన్ను అని కోర్టు నిర్ధారించింది. అందువల్ల ఈ విధానాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటిస్తూ, పూర్తిగా రద్దు చేస్తున్నాం” అని తీర్పులో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
భారీగా తగ్గిన దరఖాస్తులు
ఈ ఫీజు పెంపు వల్ల హెచ్-1బి వీసా దరఖాస్తులు భారీగా పడిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో 3,43,981గా ఉన్న హెచ్-1బి రిజిస్ట్రేషన్లు, 2027 ఆర్థిక సంవత్సరానికి 2,11,600కి పడిపోయాయి. అంటే దాదాపు 38.5 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నాటికి కేవలం 85 మంది మాత్రమే లక్ష డాలర్ల ఫీజు చెల్లించినట్లు ప్రభుత్వం మార్చిలో కోర్టుకు తెలిపింది. సాధారణంగా హెచ్-1బీ వీసా కోసం కంపెనీలు 2,000 నుంచి 5,000 డాలర్ల వరకు ఫీజు చెల్లిస్తాయి.
అమెరికన్ ఉద్యోగుల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకోవడానికి హెచ్-1బి కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ విధానం వల్ల దేశ ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (STEM) రంగాల్లో వేతనాలను కృత్రిమంగా తగ్గించడానికి కంపెనీలు ఈ వీసాలను వాడుకుంటున్నాయని ఆక్షేపించింది.
భారతీయులపై తీవ్ర ప్రభావం
ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్పులు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా టెక్ రంగంలో ఇప్పటికే ఉద్యోగాల కోతలు పెరగడంతో కంపెనీలు అధిక ఫీజులు చెల్లించి విదేశీయులను నియమించుకోవడానికి వెనుకడుగు వేశాయి. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది భారతీయ నిపుణులు, నిబంధనల ప్రకారం 60 రోజుల్లో కొత్త ఉద్యోగం సంపాదించలేక స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.








