అర్ధరాత్రి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి… న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజక పునర్విభజన బిల్లును కేంద్రం గురువారం ప్రవేశపెట్టింది. దీనిపై తీవ్రమైన వాదోప వాదాలు, చర్చోప చర్చలు సభలో జరిగాయి. 18 గంటల చర్చ తర్వాత షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగనుంది. కానీ.. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. బిల్లులపై పార్లమెంటులో తీవ్ర యుద్ధమే నడుస్తున్న తరుణంలో కేంద్ర న్యాయశాఖ సంచలన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్ధరాత్రి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వచ్చినట్లుగా పేర్కొంది. దీంతో తీవ్ర సంచలనం రేగింది.
మహిళా రిజర్వేషన్ చట్టం 2023 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిందని న్యాయశాఖ తన నోటిఫికేషన్ జారీ చేసింది. రాజ్యాంగ (106 వ సవరణ) చట్టం 2023 లోని నిబంధనలు ఏప్రిల్ 16,2026 నుంచి అమలులోకి వస్తుందని ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది.
ఇవి కూడా చదవండి
అయితే, అదే చట్టాన్ని సవరించడంపై పార్లమెంటరీ చర్చ జరుగుతున్న సమయంలో, ఏప్రిల్ 16 నుండి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు నోటిఫికేషన్ ఎందుకు జారీ చేశారనే విషయంపై స్పష్టత లేదు. అయితే పీటీఐ వార్తా సంస్థ ప్రకారం… దీనికి సాంకేతిక కారణాలు అని పేర్కొంది.. అంతేగానీ స్పష్టమైన వివరాలు మాత్రం చెప్పలేదు.
ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ, ప్రస్తుత లోక్సభలో మహిళలకు దీని ప్రయోజనాలు తక్షణమే లభించవు. తదుపరి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తైన తర్వాతే మహిళలకు రిజర్వేషన్లు లభిస్తాయని అందులో పేర్కొంటున్నారు.ప్రస్తుతం లోక్సభలో చర్చలో ఉన్న మూడు బిల్లులు, 2029 నుండి ఈ రిజర్వేషన్ను అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
అంతకుముందు, మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై పార్లమెంటులో జరుగుతున్న చర్చను ప్రస్తావిస్తూ, ఈ చర్యకు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి మోదీ అందరికీ విజ్ఞప్తి చేశారని రిజిజు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








