మహిళా రిజర్వేషన్లతో ఎవరికీ నష్టం లేదు: కేంద్ర మంత్రి మేఘ్వాల్
Arjun Ram Meghwal: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు వల్ల ఏ రాష్ట్రానికి కానీ, పురుషులకు కానీ ఎటువంటి నష్టం వాటిల్లదని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇవ్వడంతో పాటు, డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు వీలుగా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ, పార్లమెంట్ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని కొనియాడారు.
మహిళలకు 272 స్థానాలు..
భవిష్యత్ లోక్సభ స్థానాల సంఖ్య 815కు పెరిగే అవకాశం ఉందని, తద్వారా మహిళలకు ఏకంగా 272 స్థానాలు లభిస్తాయని మంత్రి వివరించారు. ఈ బిల్లుల వల్ల మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుందని, మహిళా కోటాలోనే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉపకోటా కూడా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్ 368 ప్రకారం ప్రజాహిత నిర్ణయాలు తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉందని, భావితరాలు గుర్తుంచుకునేలా ఈ నిర్ణయం ఉంటుందని మేఘ్వాల్ తెలిపారు.
ఆమోదం పొందిన వెంటనే అమలు చేయాలని..
అయితే, మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)తో ముడిపెట్టడాన్ని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తప్పుబట్టారు. రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే దానిని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పెంపు ప్రక్రియను సాకుగా చూపి రిజర్వేషన్ల అమలును ఆలస్యం చేయాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళా రిజర్వేషన్లకు అనుకూలంగానే ఉంటుందని, కానీ అమలులో జాప్యం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








