డీలిమిటేషన్ పై రేవంత్, కేటీఆర్ ఒకేమాట!
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టించింది. రాష్ట్రంలో ఉప్పూ నిప్పులా ఉండే అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్.. ఢిల్లీ వేదికగా కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలపై ఒకే గళాన్ని వినిపిస్తున్నాయి. సిద్ధాంతాలు వేరైనా, రాజకీయ ఎత్తుగడలు భిన్నమైనా, ‘దక్షిణాది ప్రయోజనాలు’ అనే పాయింట్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే తాటిపైకి రావడం గమనార్హం.
పునర్విభజన గనుక కేవలం 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన జరిగితే, జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోతుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న, జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తెలంగాణ వంటి రాష్ట్రాలను సీట్ల పెంపు విషయంలో శిక్షించడం అన్యాయమని కేటీఆర్ గట్టిగా వాదిస్తున్నారు. ప్రస్తుత పార్లమెంటులో దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా ఏ మాత్రం తగ్గకూడదని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇదే అంశంపై గతంలో ప్రధాని మోదీకి లేఖ రాస్తూ.. దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేలా విభజన ఉండకూడదని స్పష్టం చేశారు. కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా సీట్ల కేటాయింపు ఉంటే అది సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆయన భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడంపై కూడా ఇరు పార్టీల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ల అమలును పునర్విభజన తర్వాతే చేపడతామనడం రాజకీయ జాప్యమేనని కేటీఆర్ విమర్శిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం చెబుతున్న 50 శాతం సీట్ల పెంపు అంచనాలపై ఎక్కడా అధికారిక స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు.
విధానపరంగా ఇద్దరు నేతలు ఒకే వైఖరిని ప్రదర్శిస్తున్నప్పటికీ, రాష్ట్ర రాజకీయ సమీకరణాల వల్ల వీరు కలిసి పోరాడే అవకాశం లేదు. దక్షిణాది హక్కుల కోసం పోరాడుతున్నాం అనే క్రెడిట్ ఎవరికి దక్కాలనే విషయంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని రేవంత్ రెడ్డి పదేపదే విమర్శిస్తూ ఉంటారు. కానీ డీలిమిటేషన్ విషయంలో బీజేపీ ప్రపోజల్ ను వ్యతిరేకించడం ద్వారా తాము బీజేపీకి అనుకూలం కాదనే విషయాన్ని కేటీఆర్ చెప్పదలుచుకున్నారు.
గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్వహించిన సమావేశానికి ఇద్దరు నేతలు హాజరై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇది కేవలం సిద్ధాంతాల పోరాటం కంటే పవర్ పాలిటిక్స్ గానే ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం తెలంగాణకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదని కేటీఆర్ ఎద్దేవా చేయడం ద్వారా బీజేపీని కార్నర్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా దక్షిణాది రాష్ట్రాల ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటోంది. డీలిమిటేషన్ అంశాన్ని జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఇష్యూగా మార్చాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
డీలిమిటేషన్ అంశం తెలంగాణలో ఒక అసాధారణ రాజకీయ వాతావరణాన్ని సృష్టించింది. ఒకే సమస్యపై అధికార, ప్రతిపక్షాలు ఒకే మాట మీద ఉన్నా.. గల్లీలో ఉన్న వైరం వల్ల ఢిల్లీలో గళం కలపలేకపోతున్నాయి. ఒకవేళ కేంద్రం ఏకపక్షంగా జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే, ఈ ఇద్దరు నేతలు విడివిడిగానే నిరసన గళాలు వినిపిస్తారా లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం అనివార్యంగా ఒకే వేదికపైకి వస్తారా అన్నది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి








