ఇది బెదిరింపు కాదు ఫైనల్ వార్నింగ్: సీఎం స్టాలిన్
MK Stalin: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియోను విడుదల చేసిన ఆయన, కేంద్రానికి ఇది తన చివరి హెచ్చరిక అని స్పష్టం చేశారు. అశాస్త్రీయంగా చేపడుతున్న ఈ ప్రక్రియను తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రత్యేక సమావేశ ఏర్పాటు:
ఈ నెల 16న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో స్టాలిన్ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పునర్విభజన వల్ల నష్టపోయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు , రాజకీయ పార్టీలతో చెన్నైలో ఇప్పటికే ఒక ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గదని పార్లమెంటులో స్పష్టమైన హామీ ప్రధాని మోదీ ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.
ప్రధాని తీరుపై అసహనం:
ఈ కీలక అంశంపై చర్చించేందుకు ప్రధాని అపాయింట్మెంట్ కోరినప్పటికీ, కేంద్రం స్పందించకపోవడాన్ని స్టాలిన్ తప్పుబట్టారు. డీలిమిటేషన్‌పై కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
అలుపెరగని పోరాటం:
“ఇది కేవలం బెదిరింపు కాదు.. ఫైనల్ వార్నింగ్. కేంద్రం మొండిగా ముందుకు వెళ్తే తమిళనాడులోని ప్రతి కుటుంబం వీధుల్లోకి వచ్చి పోరాడుతుంది. ఈ యుద్ధంలో తమిళనాడు ప్రజలే గెలుస్తారు” అని స్టాలిన్ పేర్కొన్నారు. నియోజకవర్గాల విభజన అంశంపై తమిళనాడు కేవలం ప్రేక్షక పాత్ర పోషించదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అలుపెరగని పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.








