చెన్నై ఓటర్లకు డీఎంకే గాలం.. ‘సూపర్-6’ పేరుతో భారీ హామీలు!
DMK Manifesto: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా అధికార డీఎంకే పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. రాష్ట్రవ్యాప్త హామీలతో పాటు, రాజధాని చెన్నై ఓటర్లను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం పార్టీ కార్యాలయంలో ‘చెన్నై సూపర్-6’ పేరిట ప్రత్యేక మ్యానిఫెస్టోను ఆవిష్కరించారు.
సూపర్-6 అంశాలు ఇవే..
నగరవాసుల ప్రధాన సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ఈ ఆరు కీలక హామీలను డీఎంకే ప్రకటించింది.
- యువతకు ఉపాధి కల్పించేలా రూ.10 వేల కోట్లతో భారీ టెక్ హబ్ ఏర్పాటు.
- మెట్రో రైలు విస్తరణతో పాటు నగరవ్యాప్తంగా వెయ్యి మినీ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం.
- ట్రాఫిక్ కష్టాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం.
- నీటి కాలువలు, రహదారి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం , నగరమంతా పచ్చదనాన్ని పెంచడం.
- వీధి కుక్కల నియంత్రణకు కఠిన చర్యలు, వెటర్నరీ డాక్టర్ల సంఖ్యను మూడు రెట్లు పెంచడం.
- చెన్నైని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేలా క్షేత్రస్థాయి సిబ్బందిని పెంచి వసతులు మెరుగుపరచడం.
డీఎంకే 20 చోట్ల పోటీ ..
తమిళనాడు రాజకీయాల్లో చెన్నైపై పట్టు సాధించిన పార్టీకే ప్రభుత్వ ఏర్పాటు సులభమవుతుందని విశ్లేషకులు చెబుతుంటారు. గ్రేటర్ చెన్నై పరిధిలోని 22 నియోజకవర్గాల్లో డీఎంకే ఏకంగా 20 చోట్ల పోటీ చేస్తోంది. స్వయంగా సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఇక్కడి నుంచే బరిలో ఉండటం విశేషం.
మరోవైపు అన్నాడీఎంకే 18 స్థానాల్లో పోటీ పడుతుండగా, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ (TVK) కూడా బలమైన పోటీని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, మే 4న వెలువడే ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో చూడాలి.








