Devi Sri Prasad: ఎగ్జైట్మెంట్ లేకుండా ఏ పనీ చేయలేను
సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) ఇప్పుడు కొత్త దిశగా అడుగులు వేస్తున్నాడు. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన ఆయన, హీరోగా పరిచయం అవ్వబోతుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ అవార్డ్స్ కార్యక్రమంలో మాట్లాడిన డీఎస్పీ, తాను ఇప్పటివరకు నటన వైపు ఎందుకు రాలేదో స్పష్టంగా వెల్లడించాడు. “ఎగ్జైట్మెంట్ లేని పని నేను చేయను” అని చెప్పిన ఆయన, చాలా కథలు విన్నప్పటికీ తనను పూర్తిగా ఆకట్టుకునే సబ్జెక్ట్ మాత్రం దొరకలేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి
అయితే ఎల్లమ్మ కథ విన్న తర్వాత తన ఆలోచన పూర్తిగా మారిపోయిందని డీఎస్పీ చెప్పాడు. స్క్రిప్ట్ వినడం ప్రారంభించిన ఐదు నిమిషాల్లోనే ఈ సినిమా మనం చేయాల్సిందే అనిపించిందని వెల్లడించాడు. ఆ కథలోని భావోద్వేగం, ఆధ్యాత్మికత తనను వెంటనే కనెక్ట్ అయ్యేలా చేశాయని పేర్కొన్నాడు. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని, ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చే కథ అని దేవీ నమ్మకంగా చెప్పాడు.
ఈ సందర్భంగా తన కెరీర్లోని ఆసక్తికరమైన అనుసంధానాన్ని కూడా దేవీశ్రీ గుర్తుచేసుకున్నాడు. సంగీత దర్శకుడిగా తన మొదటి సినిమా దేవి కూడా అమ్మవారి నేపథ్యంతోనే వచ్చిందని, ఇప్పుడు హీరోగా చేస్తున్న మొదటి సినిమా కూడా అమ్మవారి పేరుతో ఉండటం యాదృచ్ఛికం కాదని, దైవానుగ్రహమేనని అభిప్రాయపడ్డాడు. ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కబోతున్నానని, అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాజెక్ట్ అందరికీ మంచి తీసుకురావాలని ఆశిస్తున్నానని డీఎస్పీ తెలిపాడు.








