WTITC: డబ్ల్యూటిఐటిసి పాలక మండలిలోకి శ్రీధర్ గోనేపల్లి
హైదరాబాద్: ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (WTITC) పాలక మండలి సభ్యుడిగా ప్రముఖ అంతర్జాతీయ ఐటీ నిపుణుడు శ్రీధర్ గోనేపల్లిని నియమించినట్లు డబ్ల్యూటిఐటిసి ప్రకటించింది. ఈ నియామకానికి మండలి పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సంస్థ తెలిపింది.
కెనడా పౌరసత్వం కలిగిన శ్రీధర్ గోనేపల్లి, కెనడా, అమెరికా, భారత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్ఎస్ఎంఈ ఇన్కార్పొరేషన్ సంస్థకు సీఈఓగా ఉన్నారు. 25 సంవత్సరాలకు పైగా ఐటీ రంగ అనుభవం కలిగిన ఆయన, 10కిపైగా దేశాల్లో పలు కీలక సాంకేతిక ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు. ఏఐ, ఆటోమేషన్ కన్సల్టింగ్, ఐటీ ప్రాజెక్ట్ డెలివరీ, ఏఐ ఆధారిత స్టాఫింగ్ సొల్యూషన్స్, ఇన్నోవేషన్ మరియు ప్రాసెస్ ఆప్టిమైజేషన్ వంటి రంగాల్లో ఆయన సేవలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ఇప్పటివరకు 5,000కుపైగా ఐటీ నిపుణులకు మెంటార్‌గా మార్గదర్శనం చేయడం విశేషం.
ఈ సందర్భంగా డబ్ల్యూటిఐటిసి ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా మాట్లాడుతూ,
“ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నోక్రాట్లను ఒక వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో డబ్ల్యూటిఐటిసి ముందుకెళ్తోంది. అంతర్జాతీయ అనుభవం, ఏఐ ఆధారిత టెక్నాలజీ నైపుణ్యం కలిగిన శ్రీధర్ గోనేపల్లి గారి చేరికతో మా పాలక మండలికి మరింత బలం చేకూరుతుంది” అని అన్నారు.
నియామకంపై స్పందించిన శ్రీధర్ గోనేపల్లి, “ప్రపంచ తెలుగు ఐటీ సమాజాన్ని కలుపుతూ ముందుకు తీసుకెళ్తున్న డబ్ల్యూటిఐటిసిలో భాగమవడం గర్వంగా ఉంది. నా అంతర్జాతీయ అనుభవాన్ని సంస్థ లక్ష్యాల సాధనకు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు.
ఈ నియామకంతో డబ్ల్యూటిఐటిసి అంతర్జాతీయ స్థాయిలో తన కార్యకలాపాలను మరింత విస్తరించుకుంటూ, గ్లోబల్ తెలుగు టెక్నాలజీ కమ్యూనిటీకి బలమైన వేదికగా నిలవనుంది.






