బ్యాంకుకు వడ్డీ కట్టి విసిగిపోయారా? ఈఎంఐలో చిన్న మార్పుతో లక్షల ఆదా
Home Loan: సొంతింటి కలను నిజం చేసుకునే క్రమంలో గృహ రుణాలు ఎంతో అవసరం. అయితే, ఇవి దీర్ఘకాలిక రుణాలు కావడంతో, తీసుకున్న అసలు కంటే వడ్డీ రూపంలోనే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి ఒక సులభమైన మార్గం ఉంది. అదే, ప్రతి నెలా చెల్లించే ఈఎంఐకి అదనంగా మరో రూ. 1,000 జమ చేయడం. ఈ పద్ధతి ద్వారా రుణ కాలపరిమితిని సులభంగా తగ్గించుకోవచ్చు.
అదనపు చెల్లింపులతో ఆదా ఎలా?
ఉదాహరణకు, 8.5 శాతం వడ్డీ రేటుతో 20 సంవత్సరాల (240 నెలలు) కాలపరిమితికి రూ. 75 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. అప్పుడు మీ నెలవారీ ఈఎంఐ రూ. 64,600గా ఉంటుంది. ఈ రుణంపై 240 నెలల పాటు చెల్లిస్తే మొత్తం రూ. 1,55,10,948 చెల్లించాల్సి వస్తుంది, ఇందులో వడ్డీ మాత్రమే రూ. 80,10,948గా ఉంటుంది. ఒకవేళ మీరు ఈఎంఐకి అదనంగా రూ. 1,000 కలిపి, అంటే రూ. 65,600 చెల్లిస్తే, రుణ కాలపరిమితి దాదాపు 9 నెలలు తగ్గి, 231 నెలల్లోనే రుణం పూర్తవుతుంది. ఈ మార్పు ద్వారా మొత్తం రూ. 1,51,53,062 చెల్లిస్తే సరిపోతుంది, దీనివల్ల రూ. 3,57,886 వడ్డీ ఆదా అవుతుంది.
గరిష్ట ప్రయోజనం..
రుణం తీసుకున్న తొలి రోజుల్లోనే ముందస్తు చెల్లింపులు (Pre-payments) లేదా అదనపు ఈఎంఐ చెల్లించడం వల్ల వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది. గృహ రుణం ప్రారంభ దశలోనే ఈఎంఐలో వడ్డీ భాగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలోనే అదనపు చెల్లింపులు చేయడం వల్ల గరిష్ట ప్రయోజనం పొందవచ్చు. కాబట్టి, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రతి నెలా రూ. 1,000 అదనంగా చెల్లించడం ప్రారంభించి, భవిష్యత్తులో లక్షల రూపాయల వడ్డీ భారాన్ని తగ్గించుకోండి.








