పెట్టుబడి రాలే.. లాభం దక్కలే.. అన్నదాత ఆశలు ఆవిరవ్వాల్సిందేనా?
Mango Market: వరంగల్ మామిడి రైతులకు ఈ ఏడాది కష్టకాలం నడుస్తోంది. అకాల వర్షాలు, ఈదురుగాలుల ధాటికి తోటలు దెబ్బతిని దిగుబడి గణనీయంగా తగ్గిపోగా, మార్కెట్లో ఆశించిన ధరలు రాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, రాత్రిపూట చలి ఎక్కువగా ఉండటంతో మామిడి పూతపై తీవ్ర ప్రభావం పడిందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.
భిన్నమైన పరిస్థితులు..
జిల్లా వ్యాప్తంగా సుమారు 5,965 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. సాధారణంగా ఎకరానికి 3 నుంచి 4 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, ఈసారి అది 1.5 నుంచి 2 టన్నులకే పరిమితమైంది. ఉత్పత్తి తగ్గినప్పుడు డిమాండ్ పెరిగి ధర పెరగాల్సి ఉన్నా, ఎనుమాముల మార్కెట్లో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వ్యాపారులు సిండికేట్గా మారి..
మార్కెట్కు మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. అయితే, ఇక్కడి కమీషన్ దారులు, వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సీజన్ ప్రారంభంలో టన్నుకు లక్ష రూపాయలకు పైగా పలికిన ధర, ప్రస్తుతం 50 వేల రూపాయలు దాటడం లేదు. ఇప్పటివరకు మార్కెట్కు సుమారు 1,981 టన్నుల మామిడి రాగా, గరిష్ఠ ధర రూ. 1.20 లక్షలు, కనిష్ఠ ధర రూ. 50 వేలుగా నమోదైంది.
భారీగా నష్టం..
ప్రైవేటు గోదాములకు పంటను తరలించిన తర్వాత ‘గ్రేడింగ్’ పేరుతో ఒక్కో టన్నుకు క్వింటా వరకు కోత విధిస్తున్నారని, దీనివల్ల తమకు భారీగా నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు. హసన్పర్తికి చెందిన రైతు పెదమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ.. 8 ఎకరాల్లో 5 లక్షల పెట్టుబడి పెడితే, ప్రస్తుతం మార్కెట్లో టన్నుకు కేవలం 32 వేల రూపాయలే వస్తోందని, అసలు పెట్టుబడి కూడా చేతికి అందేలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.








