విదేశీ ఇన్వెస్టర్లకు కేంద్రం బంపరాఫర్.. ఆ పన్ను పూర్తిగా రద్దు..!
భారత మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వరదలా తరలిపోతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. విదేశీయులు దలాల్ స్ట్రీట్ నుంచి మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోకుండా ఆపేందుకు, అలాగే కొత్త పెట్టుబడులను (Foreign Investments) దేశంలోకి ఆకర్షించేందుకు బంపరాఫర్ ప్రకటించింది. భారత ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు విధించే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును పూర్తిగా రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. దీన్ని సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తెచ్చేందుకు వీలుగా.. ఆదాయపు పన్ను చట్టాన్ని సవరిస్తూ ఒక ప్రత్యేక ‘ఆర్డినెన్స్’కు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటమే లాంఛనం కాబట్టి, ఈ మెగా ట్యాక్స్ రిలీఫ్ అతి త్వరలోనే అమల్లోకి రానుంది.
కేంద్రం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
దీని వెనుక చాలా బలమైన ఆర్థిక వ్యూహం దాగి ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమంటున్న ముడి చమురు ధరలు భారత ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి తోడు మన దేశీయ మార్కెట్ల నుంచి ఈ ఏడాది విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 2.5 లక్షల కోట్లను వెనక్కి లాగేసుకున్నారు. దేశం నుంచి విపరీతంగా డాలర్లు (Foreign Investments) బయటకు వెళ్లిపోతుండటంతో, అమెరికా డాలర్ ముందు మన కరెన్సీ ‘రూపాయి’ విలువ పాతాళానికి పడిపోతోంది. ఈ భారీ నష్టాన్ని కంట్రోల్ చేసి, రూపాయికి దన్నుగా నిలబడాలనేదే ప్రభుత్వ అసలు స్కెచ్.
పన్ను రద్దుతో లాభమేంటి?
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. విదేశీ ఇన్వెస్టర్లు (Foreign Investments) మన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసి, వాటిని ఏడాదికి పైగా తమ దగ్గరే ఉంచుకుని అమ్ముకుంటే.. వారికి వచ్చిన లాభంపై 12.5 శాతం ఎల్టీసీజీ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. కానీ తాజా నిర్ణయంతో ఆ పన్ను భారం ఏమాత్రం ఉండదు. వచ్చిన లాభం మొత్తం నేరుగా ఇన్వెస్టర్ల జేబుల్లోకే వెళుతుంది. ఇంతటితో ఆగకుండా, ఈ బాండ్ల ద్వారా విదేశీయులకు వచ్చే వడ్డీ ఆదాయంపై కట్ అయ్యే 20 శాతం విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌కు కూడా భారీగా కత్తెర వేసే యోచనలో కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచంలోని ఇతర దేశాల బాండ్లతో పోలిస్తే భారత ప్రభుత్వ బాండ్లను అత్యంత లాభదాయకమైన పెట్టుబడి సాధనంగా మార్చడమే లక్ష్యంగా కేంద్రం ఈ పావులు కదుపుతోంది. ఈ పన్ను రాయితీలతో మన దేశం విదేశీ పెట్టుబడిదారులకు (Foreign Investments) ఒక స్వర్గధామంలా మారుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దెబ్బకు మళ్లీ విదేశీ నిధులు భారత్ వైపు క్యూ కడతాయని, డాలర్ల ప్రవాహంతో దేశీయ కరెన్సీ రూపాయి తిరిగి తన బలాన్ని పుంజుకుంటుందని ఆర్థిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.








