Danam Nagender: ‘దానం’ ఎపిసోడ్లో ట్విస్ట్.. హైకోర్టు నోటీసులు!
తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల అంశం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. స్పీకర్ నిర్ణయం తర్వాత ఈ వివాదం ముగిసిందని భావించినప్పటికీ, న్యాయస్థానం జోక్యంతో మళ్ళీ మొదటికి వచ్చింది.
ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన ఆయన, లోక్‌సభ ఎన్నికల సమయంలో అనూహ్యంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా, కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఈ వివాదం ముదిరింది. దానం నాగేందర్ పార్టీ మారిన వెంటనే, ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఈ పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్.. దానం నాగేందర్ అనర్హతకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ పిటిషన్లను కొట్టివేశారు.
ఇవి కూడా చదవండి
స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం అధికార పక్షానికి ఊరటనిచ్చినప్పటికీ, విపక్షాలకు మాత్రం ఆగ్రహం కలిగించింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీ కండువా కప్పుకుని, ఎన్నికల్లో కూడా పోటీ చేసిన వ్యక్తిపై ఆధారాలు లేవనడం హాస్యాస్పదమని ప్రతిపక్షాలు విమర్శించాయి.
స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో కథ మళ్ళీ అడ్డం తిరిగింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ దానం నాగేందర్‌కు నోటీసులు పంపింది. వివరణ సమర్పించడానికి కోర్టు నాలుగు వారాల సమయాన్ని కేటాయించింది. కేసు తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేసింది.
ప్రస్తుతానికి దానం నాగేందర్ అనర్హత వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉంది. స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, హైకోర్టు ఇచ్చే తుది తీర్పు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది. వచ్చే నెల 16న జరిగే విచారణలో దానం నాగేందర్ ఇచ్చే వివరణ ఏమిటి? కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది? అనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి, ఈ అనర్హత కథ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి








