79 శాతం డిజిటల్ వినియోగంతో పురోగామి మైక్రోఫైనాన్స్ మార్కెట్‌గా నిల్చిన తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణలో సూక్ష్మరుణాల వ్యవస్థ గణనీయంగా పరివర్తన చెందుతోంది. 90 శాతం మంది రుణగ్రహీతలు తమ కుటుంబ ఆదాయార్జనలో పాలు పంచుకుంటున్నారు. 79 శాతం మంది డిజిటల్ పేమెంట్ అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసుకున్నారు. అత్యధిక శాతం మంది సంఘటిత రుణ మాధ్యమాలను క్రియాశీలకంగా వినియోగించుకున్నారని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్)తో కలిసి మైక్రోఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ (ఎంఎఫ్ఐఎన్) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 10 రాష్ట్రాలవ్యాప్తంగా 10,000 మందికి పైగా రుణగ్రహీతలపై నిర్వహించిన ఈ సర్వే, ఆర్థిక భాగస్వామ్యం, డిజిటల్ వినియోగం, ఆర్థిక సమ్మిళితత్వం తదితర అంశాల్లో రాష్ట్రం సాధిస్తున్న సమతూకమైన పురోగతిని ప్రతిబింబించింది.
జీవనోపాధి కల్పన, వ్యాపార సంస్థల వృద్ధికి తోడ్పడటంలో తెలంగాణలో మైక్రోఫైనాన్స్ కీలక పాత్ర పోషిస్తోందని అధ్యయనంలో వెల్లడైంది. సర్వే నిర్వహించిన మార్కెట్లలో 94 శాతం రుణాలనేవి చిన్న వ్యాపారాలు, వాణిజ్యం, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాల్లాంటి ఫలవంతమైన అవసరాల కోసం ఉపయోగించుకోబడుతున్నాయి. క్షేత్రస్థాయిలో సంఘటిత రుణాలు, ఆదాయార్జన మధ్య పటిష్టమైన బంధాన్ని సూచిస్తూ, జీవనోపాధి కల్పనలో మైక్రోఫైనాన్స్ పోషిస్తున్న ముఖ్య పాత్రను ఇది తెలియజేస్తోంది.
అర్థిక భాగస్వామ్యం అత్యధికంగా ఉండటం తెలంగాణ బలం. జాతీయ సగటు అయిన 78 శాతం కన్నా ఎక్కువగా 90 శాతం మంది రుణగ్రహీతలు తమ కుటుంబ ఆదాయార్జనలో పాలుపంచుకుంటున్నారు. మైక్రోఫైనాన్స్ కేవలం రుణ లభ్యతను మరింతగా అందుబాటులోకి తేవడమే కాకుండా ఆదాయార్జనపరంగా కుటుంబాలకు తోడ్పాటు కూడా అందిస్తోందని, వాటికి ఆర్థిక పటిష్టత, స్థిరత్వాన్ని అందిస్తోందని ఇది తెలియజేస్తోంది. 99 శాతం మంది మైక్రోఫైనాన్స్ రుణగ్రహీతలు మహిళలే ఉండటమనేది తెలంగాణలోని మహిళలు మిగతా వారితో పోలిస్తే అధిక ఆర్థిక స్థాయిలో ఉండటానికి కూడా ఇది సంకేతం కాగలదు.
ఇవి కూడా చదవండి
అసంఘటిత రుణాలపై ఆధారపడటం 2011లో 47 శాతంగా ఉండగా ప్రస్తుతం దాదాపు 1 శాతానికి తగ్గడమనేది సంఘటిత రుణాల వైపు విస్తృతంగా చోటు చేసుకుంటున్న మార్పులను సూచిస్తోంది. నియంత్రిత సంస్థలపై విశ్వసనీయత పెరగడాన్ని ఇది ప్రతిఫలిస్తోంది. పారదర్శకమైన, నిర్మాణాత్మకమైన, చౌక రుణ సాధనాలతో ప్రయోజనం పొందుతూ ఈ పరివర్తనలో తెలంగాణ రుణగ్రహీతలు కూడా భాగంగా ఉన్నారు.
ఇతర రాష్ట్రాల్లో కన్నా తెలంగాణలో అత్యధికంగా 79 శాతం మేర డిజిటల్ వినియోగం ఉండటమనేది వివిధ రుణగ్రహీతల విభాగాల్లో రుణ వినియోగం మరియు ఆదాయార్జనకి మధ్య గల బంధం పటిష్టమవుతున్న విషయాన్ని తెలియజేస్తోంది. ఆర్థిక అక్షరాస్యత, రుణగ్రహీతలతో సంప్రదింపులు, బాధ్యతాయుతమైన రుణ విధానాలపై దృష్టి పెట్టడాన్ని కొనసాగిస్తే రుణ ఫలితాలను మరింత మెరుగుపర్చగలవని అధ్యయనం తెలియజేస్తోంది.
“అసంఘటిత వనరులపై ఆధారపడటం గణనీయంగా తగ్గి, రుణగ్రహీతలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో సంఘటిత రుణాలవైపు మొగ్గు చూపే ధోరణి స్పష్టంగా పెరుగుతుండటాన్ని ఈ అధ్యయనం తెలియజేస్తోంది. అదే సమయంలో, అధిక రుణభారం రిస్కులను తగ్గించేందుకు, క్రెడిట్ అసెస్మెంట్, ముఖ్యంగా కుటుంబాల ఆదాయార్జనకు సంబంధించిన మదింపును మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. రుణగ్రహీతలతో సంప్రదింపులు, పొదుపు అలవాట్లు, రుణాలను ఫలవంతమైన అవసరాలకు ఉపయోగించుకోవడంలాంటి సానుకూల ధోరణులనేవి జీవనోపాధులకు తోడ్పాటు అందించడంలో పరిశ్రమ పోషిస్తున్న కీలక పాత్రను తెలియజేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆర్థిక అవగాహనపై, బాధ్యతాయుతమైన విధంగా రుణాలివ్వడంపై, డిజిటల్ వినియోగంపై మరింతగా దృష్టి పెట్టడమనేవి ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంపొందించడానికి కీలకంగా ఉంటాయి” అని ఎంఎఫ్ఐఎన్ సీఈవో & డైరెక్టర్ Dr. ఆలోక్ మిశ్రా (Alok Misra) తెలిపారు.
“10 రాష్ట్రాలవ్యాప్తంగా 10,000 మంది రుణగ్రహీతలతో నిర్వహించిన ఎన్సీఏఈఆర్-ఎంఎఫ్ఐఎన్ అధ్యయనంలో వెల్లడైన విషయాలు, ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. సూక్ష్మరుణ సంస్థలు కోట్ల మంది రుణగ్రహీతల నమ్మకాన్ని చూరగొన్నాయి. ఆర్థిక అక్షరాస్యతను బలోపేతం చేసేందుకు, అవగాహనను మెరుగుపర్చేందుకు, నైపుణ్యాల్లో శిక్షణ మరియు ఇతరత్రా చర్యల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడంలో తోడ్పాటును అందించేందుకు, రుణాల పరిధికి మించి సహాయపడటానికి ఇదొక అవకాశం కాగలదు. ఈ బంధాన్ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోగలిగితే, సుస్థిర జీవనోపాధులను కల్పించడానికి, కుటుంబాలను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది” అని కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ Dr. వి. అనంత నాగేశ్వరన్ తెలిపారు.
తెలంగాణలోని రుణగ్రహీతలు మొత్తం మీద తమ రుణభారాన్ని అదుపులోనే ఉంచుకోగలుగుతున్నారు. నియంత్రణ సంస్థ నిర్దేశిత పరిమిత స్థాయిలోనే చాలా మంది ఒకటో రెండో రుణాలను మాత్రమే తీసుకుంటూ, రీపేమెంట్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఆదాయార్జనలో పాలుపంచుకోవడం, రుణాలను ఫలవంతమైన అవసరాల కోసం ఉపయోగించుకోవడం, సంఘటిత రుణాల వైపు మొగ్గు చూపుతుండటంలాంటి అంశాలనేవి సమ్మిళిత వృద్ధికి దోహదపడుతున్న అత్యుత్తమ మైక్రోఫైనాన్స్ మార్కెట్‌గా తెలంగాణ స్థానాన్ని పటిష్టం చేస్తున్నాయి.








