మెట్రో ప్రాజెక్టు జోరు.. 825 ఆస్తుల సేకరణతో ముగింపు దశకు
Old City Metro : హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మొత్తం 888 ఆస్తులకు గాను 825 ఆస్తుల సేకరణ పూర్తయిందని, ఇది దాదాపు 93 శాతానికి సమానమని మెట్రో రైలు అధికారులు వెల్లడించారు.
నిబంధనలు , వివాదాలు..
మిగిలిన ఆస్తులలో మూడు పురాతన కట్టడాలు వారసత్వ కట్టడాల పరిరక్షణ కమిటీ పరిశీలనలో ఉన్నాయి. 10 కోర్టు కేసులతో పాటు, మరికొన్ని ఆస్తుల వివాదాలు భూసేకరణ, పునరావాసం, రీసెటిల్మెంట్ అథారిటీ (ఎల్ఏఆర్ఆర్) పరిధిలో ఉన్నాయి. కొన్ని ఆస్తులు వక్ఫ్ బోర్డుకు చెందినవని తెలియక గతంలోనే కొనుగోలు చేశామని, ఇప్పుడు నోటీసులు ఇవ్వడంతో వివాదాలు మొదలయ్యాయని కొందరు పేర్కొంటున్నారు.
రూ. 820 కోట్ల పరిహారం..
బాధితులకు ఇప్పటికే సుమారు రూ. 820 కోట్ల పరిహారం చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మార్గంలో దారుల్షిఫా, పాత హవేలీ, హరిబౌలి, అలీజా కోట, శాలిబండ, పంషీర్గంజ్, ఫలక్నుమా మీదుగా ఈ ప్రాజెక్టు వెళ్తుంది. చారిత్రక కట్టడాలకు హాని కలగకుండా పనులు చేపడుతున్నామని, అలీయాబాద్ వంటి ప్రాంతాల్లో త్వరలో కూల్చివేతలు జరిపి రోడ్డు విస్తరణ చేస్తామని అధికారులు వివరించారు. దీని పర్యవేక్షణ కోసం జనరల్ కన్సల్టెన్సీకి టెండర్లు పిలిచారు.








