భగభగలాడుతున్న భాగ్యనగరం.. అర్ధరాత్రి దాటినా తగ్గని ఎండ సెగలు!
Hyderabad: రాత్రివేళల్లో నగరవాసులను ఎండ వేడి సెగలు బెంబేలెత్తిస్తున్నాయి. పగటిపూట పెరిగే ఉష్ణోగ్రతల ప్రభావం ఇప్పుడు అర్ధరాత్రి వరకు కొనసాగుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో నిద్రకు దూరమవుతున్నారు. గతంలో సాయంత్రం కాగానే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టేవి, కానీ ఇప్పుడు సాధారణం కంటే 1°C నుండి 3.3°C వరకు అదనంగా వేడి నమోదవుతుండటం గమనార్హం.
అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం..
నగరంలో విపరీతంగా పెరిగిన కాంక్రీట్ కట్టడాలు, భవనాలు, తారు రోడ్లు పగటిపూట సూర్యరశ్మిని పీల్చుకుని, ఆ వేడిని రాత్రి వేళల్లో నెమ్మదిగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. దీనినే ‘అర్బన్ హీట్ ఐలాండ్‘ ప్రభావంగా వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి
గాలి ప్రసరణకు ఆటంకం..
నగరంలో భవనాల సాంద్రత పెరిగిపోవడం వల్ల చల్లని గాలి ప్రసరణకు ఆటంకం కలుగుతోంది. దీంతో వేడి గాలి నగరంలోనే బందీ అయిపోతోంది. రాత్రిపూట ఏసీలను ఉక్కపోత నుండి తప్పించుకోవడానికి విపరీతంగా వాడుతున్నారు. అయితే వీటి నుండి వెలువడే వేడి గాలి బయటి ఉష్ణోగ్రతలను మరింత పెంచుతోంది. అభివృద్ధి పేరిట చెట్లను నరికేయడం వల్ల వాతావరణం చల్లగా మారే పరిస్థితులు తగ్గిపోతున్నాయి. వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే గ్రీన్ హౌస్ వాయువులు వేడిని వాతావరణంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి.
తెల్లవారుజామున 28 డిగ్రీల వరకు..
నగరం నడిబొడ్డున ఉన్న హైటెక్ సిటీ, నాంపల్లి వంటి ప్రాంతాల్లో రాత్రి 9 గంటల తర్వాత కూడా 33 నుండి 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. తెల్లవారుజామున 28 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గతంలో ఇది 23 నుండి 24 డిగ్రీలకే పడిపోయేవి. అయితే రాజేంద్రనగర్ వంటి శివారు ప్రాంతాల్లో భవనాలు తక్కువగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు కొంత తక్కువగా ఉంటున్నాయని, నగరంలో మాత్రం ఏటికేడు వేడి పెరుగుతూనే ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.








