నగరంలో తీవ్ర జల సంక్షోభం.. వందలాది మీటర్ల లోతు తవ్వినా చుక్కనీరు లేని వైనం
Borewell: నగరంలో భూగర్భ జలాలు ముందు ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయికి పడిపోతున్నాయి. భూగర్భంలో దాగున్న నీటిని పైకి తీసుకురావాలనే తాపత్రయంతో నగరవాసులు వందలాది మీటర్ల లోతుకు బోర్ల తవ్వకాలు జరుపుతున్నారు. ఎటు చూసినా బోరుబావుల యంత్రాలు తిరుగుతూ విచ్చలవిడిగా కొత్త బోర్లు తవ్వేస్తున్నాయి. నివాస సముదాయాల్లో పాత బోరుబావులు ఎండిపోవడంతో, ప్రత్యామ్నాయంగా భూగర్భాన్ని జల్లెడగా మారుస్తూ కొత్తవాటిని వేయిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా బోరింగ్ మిషన్ల శబ్దాలు మార్మోగుతున్నాయి. గత 15 రోజుల వ్యవధిలోనే నగర వ్యాప్తంగా సుమారు 2,500కి పైగా కొత్త బోర్లు వేసినట్లు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే మున్ముందుకూ కొనసాగితే నగరంలో తీవ్రమైన జల సంక్షోభం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
రికార్డు స్థాయికి పడిపోతున్న జలమట్టాలు..
ఈ సంవత్సరం మే నెలలో గరిష్ట స్థాయిలో నమోదైన తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా భూగర్భ జలాలు గతంలో కంటే సగటున 5 నుంచి 10 మీటర్ల మేర కిందికి దిగజారాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి, మాదాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాలతో పాటు అమీర్పేట్, కూకట్పల్లి, ఉప్పల్ పరిసరాల్లో భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. గత సంవత్సరం మే నెలతో పోల్చి చూస్తే.. ఈసారి దాదాపు 8 మీటర్ల లోతుకు నీటి మట్టాలు పడిపోయినట్లు భూగర్భ జల వనరుల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో వందల మీటర్లలో పడిన నీరు ఇప్పుడు కనీసం 1000 నుంచి 1500 మీటర్ల లోతుకు దాటిపోయింది. అయినా సరే కొన్ని చోట్ల చుక్క నీరు కూడా రావడం లేదు. నగరంలో ప్రస్తుతం పాత బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో, నివాసితులు కొత్త బోర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లలో నీటి అవసరాలు తీరక రికార్డు స్థాయిలో లోతైన బోర్లు వేస్తున్నారు.
ఈ దుస్థితికి ప్రధాన కారణం..
నగరం తన పచ్చదనాన్ని కోల్పోయి కాంక్రీట్ వనంగా మారడమే ఈ ప్రస్తుత దుస్థితికి ప్రధాన కారణంగా మారుతోంది. ప్రతి ఇల్లూ, అపార్ట్మెంట్ చుట్టూ సిమెంటింగ్ చేయడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు అసలు అవకాశం లేకుండా పోయింది. గతంలో చెరువులు, కుంటలు, ఖాళీ స్థలాలు వరద నీటిని పట్టి ఉంచి భూగర్భ జలాలను పెంచేవి. కానీ నేడు ఆ స్థలాలన్నీ బహుళ అంతస్తుల భవనాలుగా మారిపోవడంతో, పడే వర్షపు నీరంతా వృధాగా డ్రైనేజీల ద్వారా నాలాల్లోకి కొట్టుకుపోతోంది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే రంగారెడ్డినగర్ వంటి ప్రాంతాల్లో గురువారం యథేచ్ఛగా బోర్ల తవ్వకాలు జరపడం ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.








