తక్కువ ధరకే బంగారం అంటూ.. నకిలీ బిస్కెట్లతో ముంచేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలు
Gold Scams: భవిష్యత్తు అవసరాల కోసం, పిల్లల చదువులు లేదా పెళ్లిళ్ల కొరకు పసిడిపై పెట్టుబడి పెట్టాలనే సగటు మధ్యతరగతి ప్రజల ఆలోచనలను కొందరు కేటుగాళ్లు ఆసరాగా తీసుకుంటున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే స్మగ్లింగ్ బంగారం లేదా దుబాయ్ బంగారు బిస్కెట్లు ఇస్తామంటూ నగరంలో సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. రాజధాని పరిధిలోని మూడు కమిషనరేట్ల వ్యాప్తంగా గత 5 నెలల్లోనే ఇలాంటి పసిడి మోసాలపై 24 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పోలీస్ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం.. బీహార్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఇక్కడ తిష్ట వేసి గృహిణులు, చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నారు.
బంజారాహిల్స్ నకిలీ బిస్కెట్ల మోసం..
బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ జ్యువెలరీ దుకాణ యజమానికి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. తాను నగరంలోని ఓ ప్రముఖ డిక్టేటివ్ ఏజెన్సీలో పనిచేస్తున్నట్లు నమ్మించాడు. తక్కువ ధరకు బంగారు బిస్కెట్లు ఇస్తానని నమ్మించి, మొదటి మూడు సార్లు అసలు బంగారం ఇచ్చి యజమాని నమ్మకాన్ని పొందాడు. నాలుగోసారి నకిలీ బంగారు బిస్కెట్లను అంటగట్టి, సదరు దుకాణం నుండి ఏకంగా రూ.1.6 కోట్ల విలువైన ఆభరణాలను దోచుకెళ్లాడు.
సికింద్రాబాద్ దొంగ బంగారం వ్యవహారం..
సికింద్రాబాద్ పరిధిలో ఒక వ్యాపారి కొద్దిరోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి నుంచి రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కేవలం రూ. 12 లక్షలకే కొనుగోలు చేశాడు. అయితే, కొద్దిరోజులకే పోలీసులు సదరు వ్యాపారి ఇంటికి వచ్చి విచారించడంతో తాను కొన్నది దొంగసొత్తు అని తెలిసి ఆశ్చర్యపోయాడు. చివరకు కేసు కాకూడదని ప్రార్థిస్తూ ఆ నగలను పోలీసులకు అప్పగించి ఊపిరి పీల్చుకున్నాడు.
మాధాపూర్‌లో రూ. 20 కోట్ల భారీ మోసం..
మాధాపూర్‌లో ఆఫీసు తెరిచిన ఒక కేటుగాడు పసిడిపై పెట్టుబడి పెడితే భారీగా అదనపు ఆదాయం వస్తుందని నమ్మబలికాడు. నగరంలోని సాఫ్ట్వేర్ (ఐటీ) నిపుణులు, గృహిణులను నమ్మించి వారి నుండి సుమారు రూ. 20 కోట్లకు పైగా వసూలు చేసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి పారిపోయాడు.
రద్దీగా ఉండే చోట్లకు రమ్మని చెప్పి..
ఈ ముఠాలు ప్రధానంగా పురాతన నిధులు, పాత భవనాల తవ్వకాల్లో లంకెబిందెలు, బంగారు నాణేలు దొరికాయంటూ అమాయకులను నమ్మిస్తారు. మొదట నమ్మకం కలగడం కోసం అసలు బంగారం ముక్కలను చూపిస్తారు. ఆపై నమ్మకం కుదిరిన తర్వాత నిర్మానుష్య ప్రాంతాలకు లేదా రద్దీగా ఉండే చోట్లకు రమ్మని చెప్పి, నగదు తీసుకుని నకిలీ బంగారం అంటగట్టి పరారవుతారు.
కొనేవారికి రెండు రకాల నష్టాలు..
తక్కువ ధరకు వస్తోందని ఆశపడి ఇలాంటి వారిని నమ్మి కొనుగోలు చేసేవారు రెండు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు నకిలీ బంగారం వల్ల చేతి డబ్బు పోగొట్టుకుని నష్టపోతుండగా.. మరోవైపు దొంగసొత్తు అని తెలియక కొని పోలీస్ కేసుల్లో ఇరుక్కుని మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.








