ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..
Hyderabad: భాగ్యనగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తుది అనుమతి కోసం..
ప్రభుత్వ ప్రతిపాదనపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందించింది. ఈ ఉచిత ప్రయాణ పథకం అమలుకు సంబంధించి సమగ్రమైన ముసాయిదా ఎంఓయూ (Draft MoU) పంపాలని ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఐ.టి.పి పాండే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నుంచి అందే ముసాయిదాను పరిశీలించిన అనంతరం, తుది అనుమతి కోసం రైల్వే బోర్డుకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా వచ్చే సుమారు రూ. 10 కోట్ల వార్షిక ఆదాయాన్ని ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎంఎంటీఎస్ ట్రిప్పుల సంఖ్యను పెంచడం..
ప్రయాణికులు స్టేషన్ల నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు షటిల్ బస్సులను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో స్థలాన్ని కేటాయించాలని రైల్వే శాఖను కోరింది. అలాగే ఎంఎంటీఎస్ ట్రిప్పుల సంఖ్యను పెంచడం, రైళ్ల సమయపాలన పాటించడం మరియు స్టేషన్లలో మౌలిక వసతులను మెరుగుపరచడం వంటి అంశాలపై మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ రైల్వే అధికారులతో చర్చించారు.
రైల్వే అధికారులు విజ్ఞప్తి..
ఇదే సమయంలో, ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు రూ. 491.45 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. బకాయిల చెల్లింపు, ఎంఓయూ ప్రక్రియ వేగవంతమైతే, జూన్ 2 నుంచి నగర వాసులకు ఎంఎంటీఎస్ లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.








