BRS: అసెంబ్లీలో బడ్జెట్ సెగ.. చెవిలో పూలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన!
BRS: తెలంగాణ శాసనసభలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ను నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించగానే, బీఆర్ఎస్ సభ్యులు తమ నిరసనను చాలా వినూత్నంగా వ్యక్తం చేశారు.
వినూత్న నిరసన – వాకౌట్:
ప్రభుత్వం బడ్జెట్ పేరుతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ చెవులలో పూలు పెట్టుకుని సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగం మొదలవ్వగానే నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వచ్చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘ఆరు గ్యారంటీలను’ ప్రభుత్వం విస్మరించిందని వారు మండిపడ్డారు.
అసెంబ్లీ గేటు వద్ద ధర్నా:
సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఎంట్రీ గేట్ వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ హోరెత్తే నినాదాలు చేశారు. పేద మహిళలకు ఇస్తామన్న తులం బంగారం హామీ ఏమైందని నిలదీశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ విషయంలో యువతను ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. రైతులకు, మహిళలకు ఈ బడ్జెట్లో ఎలాంటి న్యాయం జరగలేదని ఆరోపించారు.
ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీ అని, సామాన్యుడికి ఇందులో దక్కింది శూన్యమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
ఇవి కూడా చదవండి








