YS Vijayamma: ఆస్తుల రగడపై నోరు విప్పిన వైఎస్ విజయమ్మ.!
వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం ఇప్పుడు కేవలం కోర్టు నోటీసులకు, రాజకీయ విమర్శలకు పరిమితం కాలేదు. దివంగత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ స్వయంగా రంగంలోకి దిగి, అఫిడవిట్ రూపంలో బాహ్య ప్రపంచానికి తన ఆవేదనను వెలిబుచ్చారు. “అసత్యాలు ప్రచారం చేయకండి.. వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను” అంటూ ఆమె చేసిన ప్రకటన ఈ వివాదాన్ని అత్యంత సున్నితమైన మలుపు తిప్పింది.
ఇటీవలికాలంలో వైఎస్ ఫ్యామిలీ ఆస్తులపై ఇంటాబయటా పెద్ద రచ్చ జరుగుతోంది. పలువురు వైసీపీ నేతలు ఈ అంశంపై ప్రెస్ మీట్లు పెట్టి షర్మిలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ అఫిడవిట్ ద్వారా ఆస్తులపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇందులో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. వైఎస్సార్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడి కుటుంబ ఆస్తులే అని స్పష్టం చేశారు. ఆస్తుల పంపకం ఇప్పటివరకు అసలు జరగలేదని ఆమె కుండబద్దలు కొట్టారు. జగన్ ఎంవోయూరాసింది కూడా షర్మిల హక్కును గుర్తించేనని, అది ఏమాత్రం దానం కాదని ఆమె స్పష్టం చేశారు.
వైసీపీ నేతలు మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని విజయమ్మ గోబెల్స్ ప్రచారంగా అభివర్ణించారు. షర్మిలకు జగన్ వేల కోట్లు ఇచ్చారని ప్రచారం చేయడంపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బు ఆస్తి పంపకం కాదని, వ్యాపార లాభాల నుంచి ఇచ్చిన డివిడెండ్ మాత్రమేనని ఆమె క్లారిటీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
“నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుక్కి తెలుసు” అని అనడం ద్వారా విజయమ్మ ఒక తల్లిగా జగన్ మనస్సాక్షిని తట్టిలేపే ప్రయత్నం చేశారు. తన మేనల్లుడికి, మేనకోడలికి (షర్మిల పిల్లలకు) జగన్ అన్యాయం చేస్తున్నాడని ఆవేదన చెందారు. సరస్వతి సిమెంట్స్‌తో పాటు బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కూడా షర్మిలదేనని ఆమె తేల్చి చెప్పారు.
రాజకీయ ప్రయోజనాల కోసం తన కుటుంబాన్ని వాడుకోవద్దని ఆమె మీడియాను కోరారు. అసత్యాలు ప్రచారం చేస్తున్న వారెవరైనా సరే, దేవుడి న్యాయమే అంతిమమని ఆమె పేర్కొనడం ద్వారా నైతిక పైచేయి సాధించే ప్రయత్నం చేశారు.
ఈ అఫిడవిట్ ద్వారా విజయమ్మ ఒక ముఖ్యమైన సాక్షిగా మారారు. రేపు కోర్టులో ఆస్తుల వివాదం నడిచినప్పుడు, వైఎస్సార్ బతికున్నప్పుడు ఉన్నవన్నీ కుటుంబ ఆస్తులేనని ఆమె చెప్పిన మాటలు జగన్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. షర్మిల ఒంటరిగా పోరాడుతుందనే భావన కలగకుండా, కుటుంబ పెద్దగా విజయమ్మ ఆమె పక్షాన నిలిచారు. వైఎస్సార్ ఆశయం ప్రకారం నలుగురు మనవలకు సమాన వాటా దక్కాలనే పాయింట్‌ను ఆమె బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
“దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలే” అని ముగించడం ద్వారా విజయమ్మ ఈ వివాదానికి అత్యున్నత ప్రాధాన్యతను ఇచ్చారు. అధికార బలంతోనో, అబద్ధపు ప్రచారాలతోనో గెలవాలని చూసేవారికి ఆమె పరోక్షంగా చురకలు అంటించారు. జగన్ తన తల్లి మాటలను మన్నించి తన సోదరికి న్యాయం చేస్తారా? లేక ఈ వివాదం రాజకీయ రచ్చగా మారుతుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇవి కూడా చదవండి








