YCP: ఇన్ఛార్జ్ మార్పులతో వైసీపీలో కలకలం.. అయోమయంలో పశ్చిమ గోదావరి జిల్లా నేతలు..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) వైసీపీలో (YSR Congress Party) ప్రస్తుతం తీవ్ర అస్థిరత నెలకొంది. ఎప్పుడు ఎవరి పదవులు మారుతాయో, ఎవరికెప్పుడు షాక్ తగులుతుందో అర్థం కాని పరిస్థితి అక్కడి నాయకుల్లో కనిపిస్తోంది. తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి, ఆ స్థానంలో వడ్డీ రఘురామ్ (Vaddi Raghuram) ను నియమించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కొట్టు వంటి నేతను తప్పించడం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తీసుకున్న కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. ఆయన పనితీరుపై అసంతృప్తే ఈ మార్పుకు కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి.
తాడేపల్లిగూడెంలో మార్పుల తర్వాత ఇప్పుడు ఆచంట నియోజకవర్గంపై దృష్టి పడినట్లు తెలుస్తోంది. అక్కడ మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు (Cherukuvada Ranganatha Raju) భవితవ్యం అనిశ్చితంగా మారింది. వయసు, యాక్టివిటీ అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయనను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. ఆచంట బాధ్యతలను గత ఎన్నికల్లో పాలకొల్లు నుంచి పోటీ చేసిన గుడాల గోపీ (Gudala Gopi) కు అప్పగించే అవకాశం ఉందని చర్చ సాగుతోంది.
ఇక పాలకొల్లు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన గుణ్ణం నాగబాబు (Gunnam Nagababu) కు బాధ్యతలు ఇవ్వాలనే వ్యూహాన్ని జగన్ అమలు చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. పాలకొల్లులో కాపు, ఆచంటలో శెట్టిబలిజ సామాజిక సమీకరణాలు బలపడేలా ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఏలూరులో ప్రస్తుతం జేపీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నా, వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ దక్కుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
తణుకులో మరో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao) స్థానంలో ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ (Karumuri Sunil Kumar Yadav) ను ఇన్‌ఛార్జ్‌గా నియమించే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఏలూరు పార్లమెంట్ నుంచి ఓడిపోయిన సునీల్‌కు కొత్త బాధ్యతలు అప్పగించడం ద్వారా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశం ఉందని అంటున్నారు. నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే జీఎస్ శ్రీనివాసుల నాయుడు (G. S. Srinivasula Naidu) కు కూడా మార్పులు తప్పవన్న అభిప్రాయం వినిపిస్తోంది. భీమవరంలోనూ నాయకత్వ మార్పులపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
చింతలపూడిలో ఇన్ఛార్జ్ కంభం విజయరాజు (Kambham Vijaya Raju) పార్టీ కోసం కష్టపడుతున్నా, అక్కడ మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ (Kotagiri Sridhar) వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో ఆయన భవిష్యత్‌పై స్పష్టత లేకపోవడం క్యాడర్‌ను అయోమయంలో పడేస్తోంది. మొత్తం మీద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి అనిశ్చితంగా మారింది. ఎప్పుడు ఎవరికెలాంటి నిర్ణయం వస్తుందో తెలియక, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.






