US-Iran War: ట్రంప్ యుద్ధ విరామం వెనక వ్యూహమేంటి…?
పశ్చిమాసియాలో పరిస్థితులు భీకరంగా మారిన వేళ.. ట్రంప్ శాంతి మంత్రం పఠించారు. ఏకంగా 5 రోజుల పాటు యుద్ధ విరామం ప్రకటించారు. దీనికి ఇరాన్ తో జరుగుతున్న చర్చలు కారణంగా చెప్పారు. అయితే అది నిజమేనా..? అంటే కాదని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు “యుద్ధం ఆపేదే లేదు” అన్న ధోరణి ట్రంప్ లో కనిపించినా, ఒక్కసారిగా వెనక్కి తగ్గడం వెనుక కేవలం దౌత్య ప్రయత్నాలే కారణమా? లేక అంతర్జాతీయంగా మిత్రదేశాల నుండి ఒత్తిడి కూడా పనిచేసిందా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొన్నిరోజుల క్రితం హోర్ముజ్ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారినప్పటికీ, అమెరికా పిలుపు మేరకు మిత్రదేశాల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభించలేదన్న సమాచారం రక్షణ వర్గాల్లో వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో, ఇరాన్ పై యుద్ధం విషయంలో అమెరికా ఒంటరిగా ముందుకు వెళ్లాల్సి వస్తుందన్న సంకేతాలు ట్రంప్ కి అప్పుడే కనిపించడంతో యుద్ధం నుంచి వ్యూహాత్మకంగా విరామం తీసుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఒకరకంగా అమెరికా వెనుకడుగే అయినప్పటికీ, ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకునే మంచి విషయమే.
ఇక యూరోపియన్ దేశాలు కూడా మరో పెద్ద యుద్ధానికి ఆసక్తి చూపడం లేదని, అసలు యుద్ధాలే కోరుకోవడం లేదనీ, అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ముఖ్యంగా యుద్ధం మరింత విస్తరిస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా పై మిత్ర దేశాల నుంచి ఒకింత ఒత్తిడి వచ్చిందనే విషయం కాదనలేం.
ఇవి కూడా చదవండి
అదే సమయంలో, ఇరాన్ వర్గాలు మాత్రం మరో కోణాన్ని ప్రస్తావిస్తున్నాయి. అమెరికా దాడులకు విరామం ప్రకటించడం వెనుక ట్రంప్ లో మొదలైన భయం కూడా కారణమై ఉండొచ్చని వారు అంటున్నారు. ముఖ్యంగా ఇరాన్ రక్షణ సామర్థ్యం, యుద్ధంలో ప్రతిదాడి చేయగల శక్తి పెరిగిన నేపథ్యంలో ఆ దేశంతో అమెరికా జాగ్రత్తగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు, ఈ విరామాన్ని ఉపయోగించుకుని అమెరికా తన సైనిక, ఆర్థిక వ్యూహాలను పునర్వ్యవస్థీకరించుకునే అవకాశం కూడా ఉంది. యుద్ధంలో అమెరికా చేసిన ఆయుధాల వినియోగం, యుద్ధం పై వెచ్చించిన డబ్బు వల్ల పెరిగిన ఆర్థిక ఒత్తిడి, అంతర్జాతీయ సంబంధాలు ఇవన్నీ కలిపి ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి కారణమై ఉండొచ్చని అంచనా.
ఇవి కూడా చదవండి








