LNG: ప్రపంచానికి గ్యాస్ సెగ, రాబోయే 5 ఏళ్లు ఎల్ఎన్జీ కొరత తప్పదా?
హార్ముజ్ జలసంధిని(Strait of Hormuz ) ఇరాన్(Iran) అడ్డుకోవడం, ఖతార్‌లోని(Qatar) రాస్ లఫాన్ (Ras Laffan) ఇంధన కేంద్రంపై జరిగిన దాడుల నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా రాబోయే 5 ఏళ్ల పాటు ఎల్ఎన్జీ (LNG) కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖతార్ ఎనర్జీ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ ఆందోళనను తీవ్రం చేసాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతిదారు అయిన ఖతార్‌పై జరిగిన దాడులు, అంతర్జాతీయ ఇంధన సరఫరా గొలుసును (Supply Chain) ఛిన్నాభిన్నం చేశాయి. ఇది కేవలం తాత్కాలిక సమస్య కాదు, దీర్ఘకాలిక సంక్షోభానికి నాంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి

ఖతార్ ఎనర్జీ తన సుదీర్ఘకాల ఒప్పందాలపై ‘ఫోర్స్ మెజూర్’ ప్రకటించింది. అంటే, యుద్ధం వంటి అనివార్య కారణాల వల్ల తాము గ్యాస్ సరఫరా చేయలేమని చెప్పేసింది. ఈ పరిస్థితి కనీసం 5 ఏళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది. రాస్ లఫాన్‌లోని అత్యాధునిక గ్యాస్ ప్లాంట్లు, టెర్మినల్స్ క్షిపణి దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిని మళ్లీ నిర్మించడానికి, విదేశీ సాంకేతికతను తీసుకురావడానికి కనీసం 3 నుండి 5 ఏళ్ల సమయం పడుతుంది. ఖతార్ ఎగుమతుల్లో 17% ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ లోటును పూడ్చడం అంత సులభం కాదు.
సరఫరా తగ్గడంతో మార్కెట్లో గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఇది యూరప్ మరియు ఆసియా దేశాల్లో విద్యుత్ మరియు పారిశ్రామిక ఉత్పత్తి ఖర్చులను విపరీతంగా పెంచే అవకాశాలు ఉన్నాయి. రష్యా నుంచి ఇప్పటికే గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో, ప్రపంచం ఖతార్‌పైనే ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు ఖతార్ కూడా దెబ్బతినడంతో ఇతర దేశాల వద్ద తగినంత నిల్వలు లేవు. భారత్ తన ఎల్ఎన్జీ అవసరాల కోసం అత్యధికంగా ఖతార్‌పైనే ఆధారపడుతుంది. పెట్రోల్, డీజిల్ తరహాలోనే ఎల్పీజీ (LPG) ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. గ్యాస్ ధరలు పెరిగితే ఎరువుల తయారీ (Fertilizers), విద్యుత్ ప్లాంట్లు, సిరామిక్ పరిశ్రమలపై భారీ భారం పడుతుంది. కేవలం గ్యాస్ మాత్రమే కాదు, హీలియం సరఫరాలో 14% కోత పడటంతో, ఆసుపత్రుల్లో ఎంఆర్ఐ స్కాన్ మిషన్లు, ఐటీ రంగంలో సెమీకండక్టర్ చిప్స్ తయారీకి తీవ్ర ఆటంకం కలుగుతుంది.
ఇవి కూడా చదవండి








