Britain: ట్రంప్‌కు బ్రిటన్ ప్రధాని షాక్.. పశ్చిమాసియా యుద్ధంలో మేము చేరం
అంతర్జాతీయ రాజకీయాల్లో బ్రిటన్ (Britain)ప్రధాని కీర్ స్టార్మర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనప్పటికీ, పశ్చిమాసియా (Middle East) యుద్ధంలో పాల్గొనే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా కీర్ స్టార్మర్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వానికి బ్రిటన్ ప్రజల క్షేమం మరియు ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో తమకు నేరుగా ఎటువంటి సంబంధం లేదని, అనవసరంగా ఇతర దేశాల ఘర్షణల్లో తలదూర్చి తమ సైన్యాన్ని లేదా ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల్లోకి నెట్టలేమని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న హార్మూజ్ జలసంధి (Hormuz Strait) సంక్షోభంపై కూడా ప్రధాని స్పందించారు. ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి మరియు యుద్ధాన్ని నివారించడానికి బ్రిటన్ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. అవసరమైతే తాము మధ్యవర్తిత్వం వహించి శాంతి చర్చలకు బాటలు వేస్తామని, అంతేకానీ యుద్ధంలో భాగస్వాములం కాబోమని స్పష్టం చేశారు.
సాధారణంగా అమెరికా నిర్ణయాలకు బ్రిటన్ మద్దతు ఇస్తుంటుంది. అయితే, ట్రంప్ హయాంలో యుద్ధంలో చేరాలని వచ్చిన సూచనలను స్టార్మర్ సున్నితంగా తిరస్కరించడం విశేషం. బ్రిటన్ విదేశాంగ విధానంలో ఇది ఒక కీలక మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. దూకుడుగా వెళ్తున్న అమెరికా వైఖరికి భిన్నంగా, శాంతి మరియు తటస్థ వైఖరిని బ్రిటన్ ఎంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉంటే.. నాటో కూటమి నుంచి తప్పుకునే యోచనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald trump) ఉన్నట్లు సమాచారం. నాటో(Nato) పేపర్ పులి అంటూ ఆయన మరోసారి విమర్శలు గుప్పించారు.








