PM Modi: నిరాశతో బట్టలు చింపుకుంటున్నారు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర ధ్వజం
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకుని దేశంలో అకారణంగా భయాందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అస్సాంలోని సిల్చార్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని.. విపక్ష కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగారు. జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రతిపక్షం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
బాధ్యత మరచిన ప్రతిపక్షం..
పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం సామాన్య భారతీయులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని ప్రధాని (PM Modi) స్పష్టం చేశారు. “ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని యావత్ దేశం ఆశించింది. కానీ జాతీయ ప్రయోజనాల విషయంలో ఆ పార్టీ మరోసారి ఘోరంగా విఫలమైంది. పనిగట్టుకుని ప్రజల్లో భయాలు సృష్టించి, తద్వారా నన్ను రాజకీయంగా వేధించాలన్నదే వారి ఏకైక లక్ష్యం” అని మోదీ (PM Modi) మండిపడ్డారు. భారతదేశం సాధిస్తున్న అభివృద్ధిని ఏమాత్రం జీర్ణించుకోలేని దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక కీలుబొమ్మలా మారిపోయిందని ఆయన ఆరోపించారు.
అస్సాం ప్రజలను ఉద్దేశించి ప్రధాని (PM Modi) మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి ఓటర్లు ఎప్పుడో గట్టి బుద్ధి చెప్పి, రాష్ట్రం నుంచి తరిమికొట్టారని ప్రశంసించారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర విధానాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రతి రాష్ట్రం కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నిరాశలో కూరుకుపోయారు..
ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్ (AI Impact Summit)లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి చేసిన నిరసనను ప్రధాని మోదీ (PM Modi) తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ తీవ్రంగా తప్పుబట్టారు. అంతర్జాతీయ స్థాయి సదస్సులో వారు చేసిన ఈ దుశ్చర్యను యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించిందని గుర్తుచేశారు. “వరుస ఓటములతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నారో వారికే తెలియక, ఏకంగా దేశ ప్రతిష్ఠ పైనే దాడికి దిగుతున్నారు. రాజకీయంగా వారికి భవిష్యత్తు శూన్యం.. నిరాశతో ఇలా బట్టలు చింపుకోవడం తప్ప వారికి మరేమీ మిగలలేదు” అంటూ మోదీ (PM Modi) తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు.








