గంటలో బిల్లు సవరిస్తాం.. మద్దతిచ్చే ధైర్యం ఉందా? కాంగ్రెస్కు అమిత్ షా సవాల్!
Amit Shah: లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, , కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై జరిగిన సుదీర్ఘ చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు సమాధానమిచ్చారు. మహిళా సాధికారతను పటిష్టం చేసేందుకే ఈ సంస్కరణలు చేపట్టామని, వచ్చే ఎన్నికల నాటికి వీటిని పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాల..
ప్రస్తుత నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల సంఖ్యలో ఉన్న భారీ వ్యత్యాసాలను అమిత్ షా ఎత్తిచూపారు. తెలంగాణలోని మల్కాజ్గిరిలో దాదాపు 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, అదే సమయంలో మరికొన్ని చోట్ల కేవలం 60 వేల మందే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇంత భారీ వ్యత్యాసం ఉన్నప్పుడు ఒక ఎంపీ లక్షలాది మంది ప్రజల సమస్యలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడం సాధ్యం కాదన్నారు. అందుకే డీలిమిటేషన్ ద్వారా ఓటర్ల సంఖ్యలో సమతుల్యత సాధిస్తామని, తద్వారా ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో సీట్ల సంఖ్య పెరిగి ప్రజలకు మెరుగైన ప్రాతినిధ్యం లభిస్తుందని వివరించారు.
ఇవి కూడా చదవండి
ముక్కలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం..
దేశాన్ని ప్రాంతాల వారీగా విడగొట్టేలా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. “ఉత్తరాది, దక్షిణాది అంటూ దేశాన్ని ముక్కలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం. భారత్ అంతా ఒక్కటే. దక్షిణాది రాష్ట్రాలకైనా, కేంద్రపాలిత ప్రాంతాలకైనా దేశంపై సమానమైన అధికారం ఉంటుంది” అని ఆయన ఉద్ఘాటించారు.
విపక్షాలకు సవాల్..
చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు అమిత్ షా బదులిస్తూ.. రాష్ట్రాల వారీగా సీట్లను 50 శాతం పెంచే సవరణకు తాము సిద్ధమని ప్రకటించారు. “మీరు మద్దతిస్తామని హామీ ఇస్తే, కేవలం గంటలో బిల్లులో మార్పులు చేసి తీసుకువస్తాం” అని విపక్షాలకు సవాల్ విసిరారు. 1972 నుంచి లోక్సభ సీట్ల పెంపును అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.








