Paralysis: పక్షవాతం వచ్చే ముందు బాడీ ఇచ్చే సిగ్నల్స్ ఇవే.. గుర్తుపట్టకపోతే అంతే!
Stroke Warning: పక్షవాతం (Paralysis) అనేది ఒక్కసారిగా మనిషి జీవితాన్ని తలకిందులు చేసే భయంకరమైన సమస్య. ఇది అకస్మాత్తుగా వైకల్యాన్ని తెచ్చిపెట్టి, మనిషిని ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది. అయితే, పక్షవాతం సంభవించే ముందు శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను పంపుతుంది. వైద్య భాషలో వీటిని ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్’ (TIA) అని పిలుస్తారు. ఈ ముందస్తు సంకేతాలను గుర్తించి అప్రమత్తమైతే రాబోయే పెద్ద ముప్పును సమర్థవంతంగా నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అసలు ‘టీఐఏ’ అంటే ఏమిటి?
సాధారణ పక్షవాతంలో కనిపించే లక్షణాలే టీఐఏలోనూ కనిపిస్తాయి, కానీ ఇవి తాత్కాలికంగా ఉండి కొద్దిసేపటికే (సాధారణంగా గంటలోపే) తగ్గిపోతాయి. లక్షణాలు తగ్గిపోయాయి కదా అని నిర్లక్ష్యం చేయడం ప్రాణాపాయానికి దారితీయవచ్చు. టీఐఏ వచ్చిందంటే భవిష్యత్తులో తీవ్రమైన పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం. అందుకే దీన్ని ‘మినీ స్ట్రోక్’ అని కూడా అంటారు.
ఇవి కూడా చదవండి
గుర్తించాల్సిన ప్రధాన లక్షణాలు:
ముఖం ఒక పక్కకు తిరిగిపోవడం లేదా బలహీనంగా అనిపించడం.
ఒకవైపు చేయి లేదా కాలు పడిపోవడం లేదా తిమ్మిరిగా అనిపించడం.
మాట ముద్దగా రావడం లేదా అసలు మాట్లాడలేకపోవడం.
శరీర నియంత్రణ కోల్పోవడం (బ్యాలెన్స్ తప్పడం).
అకస్మాత్తుగా చూపు మందగించడం లేదా ఒకే వస్తువు రెండుగా కనిపించడం.
ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుంది?
మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు సన్నగా మారటం లేదా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు (High BP), డయాబెటిస్, రక్తంలో కొవ్వు (Cholesterol) ఎక్కువగా ఉన్నవారు, ధూమపానం, మద్యపాన అలవాటు ఉన్నవారు, అలాగే నిద్రలో గురక (Sleep Apnea) వచ్చే వారు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
నిర్ధారణ, చికిత్స:
టీఐఏ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి MRI బ్రెయిన్, కెరోటిడ్ డాప్లర్, ECG వంటి పరీక్షలు చేయించుకోవాలి. పరిస్థితిని బట్టి రక్తాన్ని పల్చబరిచే మందులు (Aspirin, Statins) వాడాల్సి ఉంటుంది. రక్తనాళాల్లో అడ్డంకులు 70 శాతానికి పైగా ఉంటే స్టెంటింగ్ లేదా సర్జరీ అవసరం పడవచ్చు. సరైన జీవనశైలి మార్పులు, క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా పక్షవాతం బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.








