మైనర్లపై వేధింపులు.. అమెరికాలో తెలుగు వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష!
US: అమెరికాలో మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న ఫణి తాళ్లూరు(52)కు అక్కడి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. వర్జీనియా రాష్ట్రం ఆష్‌బర్న్‌లో నివసిస్తున్న అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. శిక్షా కాలం ముగిసి విడుదలైన తర్వాత కూడా మరో ఐదేళ్ల పాటు అతను అధికారుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది.
కేసు వివరాలు..
సోషల్ మీడియా ద్వారా మైనర్లకు అసభ్యకర సందేశాలు, ఫోటోలు, వీడియోలు పంపడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఫణి పాల్పడేవాడని ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించింది. ఒక టీనేజ్ బాలికకు తన నగ్న చిత్రాలు పంపి, ఆమె నుంచి కూడా అలాంటివే కావాలని వేధించేవాడు. ఈ క్రమంలోనే మరో బాధితురాలు కూడా కోర్టు ముందుకొచ్చి, తాను 11 నుంచి 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతని చేతిలో పలుమార్లు వేధింపులకు గురయ్యానని వాంగ్మూలం ఇచ్చింది.
బాధితులను బెదిరించడం..
విచారణలో మరికొన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన నేరాలు బయటపడకుండా ఉండేందుకు బాధితులను బెదిరించడం, చాట్ హిస్టరీని డిలీట్ చేయాలని ఒత్తిడి చేయడం వంటివి చేశాడని తేలింది. నిందితుడు కోర్టులో తన అనారోగ్యం, మద్యపాన వ్యసనం, డిప్రెషన్‌ను సాకులుగా చూపినప్పటికీ, ఇవి కావాలని చేసిన నేరాలని భావించిన న్యాయమూర్తి వాటిని తోసిపుచ్చారు.
ఆధారాల సేకరణ..
నిజానికి ఈ వ్యవహారం 2019లోనే వెలుగు చూసింది. అప్పట్లో కొందరు పెద్దలు రాజీకి ప్రయత్నించినప్పటికీ బాధితుల తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో భయపడి ఇండియాకు పారిపోయిన ఫణి, రెండేళ్ల తర్వాత మళ్ళీ అమెరికాకు రాగా.. 2022 నుంచి కొనసాగిన దర్యాప్తులో ఆధారాలు సేకరించిన పోలీసులు 2024 అక్టోబర్‌లో అతడిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో తుది తీర్పు వెలువడింది.
నిపుణుల హెచ్చరిక..
ఈ ఘటన అమెరికాలోని తెలుగు కుటుంబాల్లో కలకలం రేపింది. ముఖ్యంగా పిల్లల సోషల్ మీడియా వినియోగంపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఆన్లైన్లో ఎవరితో మాట్లాడుతున్నారు? ఎలాంటి సందేశాలు వస్తున్నాయి? అనే విషయాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.








