LPG: గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన..!
మధ్య ప్రాచ్యంలో నెలకొన్న యుద్ధం నేపధ్యంలో ఇప్పుడు భారత్ లో గ్యాస్ కొరత(Gas Shortage) ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత లేదని కేంద్రం చెప్పినప్పటికీ, పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. పశ్చిమ ఆసియాపై జరిగిన అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో అధికారులు మాట్లాడుతూ, ప్రస్తుతం వాణిజ్య ఎల్పీజీ సరఫరా సాధారణంగా ఉందని, భయాందోళనలతో చేసే బుకింగ్‌లు తగ్గాయని పేర్కొన్నారు. అయితే, వివిధ ప్రాంతాల నుంచి అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఫిర్యాదులు ఇంకా అందుతున్నాయని ప్రభుత్వం అంగీకరించింది.
వాణిజ్య ఎల్పీజీ(Commercial Gas) సరఫరాకు సంబంధించి 17 రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, అక్రమంగా నిల్వ చేయడం, ముఖ్యంగా ఆన్లైన్లో వదంతుల వ్యాప్తిని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిశితంగా పర్యవేక్షించాలని కోరింది. ప్రస్తుతానికి సరఫరా స్థిరంగా ఉన్నప్పటికీ, అంతరాయాలను నివారించడానికి, వినియోగదారులకు ఎల్పిజి పంపిణీ సజావుగా జరిగేలా చూడటానికి అప్రమత్తత అవసరమని అధికారులు తెలిపారు. అలాగే క్రూడ్, రిఫైనరీ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని కేంద్రం తెలిపింది.
ఎల్పీజీ నుంచి పీఎన్జీకి(PNG) మారాలని వినియోగదారులను కోరుతున్నామని కేంద్రం పేర్కొంది. పీఎన్జీ విస్తరించే రాష్ట్రాలకు అదనంగా 10 శాతం కమర్షియల్ ఎల్పీజీ అందిస్తామని తెలిపింది. కేంద్ర చర్యలతో 2 వారాల్లో 1.25 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వగలిగాంమని తెలిపింది. ఆన్లైన్ బుకింగ్‌లు(Gas Booking) 94 శాతం పెరిగాయని, నిన్న 57 లక్షల రిఫిల్ బుకింగ్‌లు వచ్చాయని వివరించారు. ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సాధారణ స్థాయిలో ఉందన్న కేంద్రం, ఎల్పీజీ బుకింగ్‌లు సాధారణ స్థాయికి చేరాయని, బ్లాక్ మార్కెటింగ్ కట్టడి చేయాలని రాష్ట్రాలకు లేఖ రాశామని పేర్కొంది. ఉల్లంఘనలు జరిగిన చోట తగిన చర్యలు తీసుకుంటున్నారని, 31 రాష్ట్రాలు, యూటీల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారని కేంద్రం వెల్లడించింది.








