LPG Shortage: కమర్షియల్ సిలిండర్ల పంపిణీ పునఃప్రారంభం
గత వారం రోజులుగా గ్యాస్ సిలిండర్ల కొరతపై (LPG Shortage) దేశవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనలకు, భయాలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. డొమెస్టిక్ గ్యాస్ అయిపోతుందన్న వదంతులతో ప్రజలు ముందస్తుగా ‘పానిక్ బుకింగ్స్’ చేస్తుండటంతో నెలకొన్న గందరగోళంపై స్పష్టత ఇచ్చింది. గ్యాస్ కొరత కారణంగా నిలిపివేసిన కమర్షియల్ (వాణిజ్య) సిలిండర్ల సరఫరాను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు వ్యాపారులకు ఊరటనిచ్చింది.
కమర్షియల్ సిలిండర్లకు గ్రీన్ సిగ్నల్
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఈ కీలక పరిణామాలను వెల్లడించారు. తెలంగాణ సహా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కమర్షియల్ సిలిండర్ల (LPG Shortage) పంపిణీకి పూర్తిస్థాయిలో స్టాక్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కమర్షియల్ సిలిండర్ల పంపిణీని అధికారికంగా పునరుద్ధరించడం ద్వారా, గృహ వినియోగ (డొమెస్టిక్) ఎల్పీజీకి ఎలాంటి ముప్పు లేదని కేంద్రం పరోక్షంగా భరోసా ఇచ్చింది. అపోహలతో భయపడాల్సిన అవసరం లేదని, దేశంలో ఎక్కడా గ్యాస్ స్టాక్ నిల్వలు పూర్తిగా అయిపోయినట్లు ఇప్పటివరకు ఫిర్యాదు రాలేదని ఆమె స్పష్టం చేశారు.
ఒక్కరోజే 83 లక్షల బుకింగ్స్..
ఇంట్లో నిండు సిలిండర్ ఉన్నప్పటికీ, భవిష్యత్తులో దొరకదేమోనన్న భయంతో వినియోగదారులు అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటున్నారు. దీనివల్ల డిమాండ్ అకస్మాత్తుగా పెరిగిపోయి, నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 83 లక్షల ఎల్పీజీ బుకింగ్స్ (LPG Shortage) జరిగాయి. ఈ కృత్రిమ కొరతకు, పానిక్ బుకింగ్స్‌కు చెక్ పెట్టేందుకు కేంద్రం రీఫిల్లింగ్‌పై కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇకపై పట్టణ ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ కోసం కనీసం 25 రోజుల గ్యాప్, అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజుల వ్యవధి తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది. సరఫరాను మెరుగుపరచడానికి దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని సైతం ఏకంగా 31 శాతం పెంచినట్లు పెట్రోలియం శాఖ వెల్లడించింది.
పీఎన్జీ ఉంటే ఎల్పీజీ కట్
గ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా, క్రమబద్ధంగా మార్చే క్రమంలో కేంద్రం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ కొరతతో (LPG Shortage) ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాణిజ్య వినియోగదారులు తక్షణమే పీఎన్జీకి (పైప్డ్ నేచురల్ గ్యాస్ – PNG) మారాలని సూచించింది. ఇందుకోసం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లతో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) ప్రత్యేక సమావేశం నిర్వహించి, అర్హులకు అత్యంత వేగంగా కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఇళ్లలో పీఎన్జీ కనెక్షన్ సౌకర్యం ఉన్న వినియోగదారులు ఇకపై ఎల్పీజీ సిలిండర్లను వాడకూడదని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.








