భారీగా పడిపోయిన అమెరికా ఆయుధ నిల్వలు.. పెంటగాన్ రిపోర్ట్..
పశ్చిమాసియా యుద్ధం.. అమెరికాపై పెను ప్రభావమే చూపిస్తోంది. కొన్ని నెలలుగా ఇరాన్ పై జరుపుతున్న దాడుల కారణంగా అమెరికా అధునాతన ఆయుధాలు …గణనీయంగా తగ్గిపోయాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవునన్నా.. కాదన్నా ఇది నూటికి నూరుపాళ్లు నిజం. ఎందుకంటే ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ హెడ్ క్వార్టర్ పెంటగాన్ ధ్రువీకరించింది కూడా…
ఇరాన్ (Iran)తో యుద్ధం అమెరికా రక్షణ రంగంపై తీవ్ర ప్రభావం చూపినట్లు పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఓ నివేదికలో వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు జరిగిన నష్టాలను నివేదికలో పొందుపరిచారు. అమెరికాలో అధునాతన ఆయుధాల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని.. వాటిని భర్తీ చేయడంలో అనేక అడ్డంకులు ఉన్నాయని పేర్కొన్నారు. యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి.. వీటిని తీసుకురావడానికి సుమారు మూడేళ్లు పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
దాడుల్లో అమెరికా దౌత్య కార్యాలయాలకు జరిగిన నష్టాన్ని నివేదిక తొలిసారిగా వెల్లడించింది. ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలోని దౌత్య కార్యాలయాలకు సుమారు 184 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. యుద్ధం నేపథ్యంలో దాదాపు 9000 మంది అమెరికా పౌరులను వివిధ దేశాల నుంచి స్వదేశానికి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ తరలింపునకు జూన్ చివరి నాటికి 11 మిలియన్ డాలర్లకుపైగా ఖర్చయినట్లు వెల్లడించింది.
‘ఇరాన్ దాడులతో కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, ఒమన్, జోర్డాన్లలోని అమెరికా సైనిక స్థావరాల్లో వందలాది భవనాలు దెబ్బతిన్నాయి. భారీగా అమెరికా విమానాలు, డ్రోన్లు ధ్వంసమయ్యాయి. యుద్ధానికి ఇప్పటివరకు 37.5 బిలియన్ డాలర్లు ఖర్చయింది’ అని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) కాంగ్రెస్కు తెలిపారు.








