Azharuddin: అజారుద్దీన్.. మంత్రి పదవి ఉంటుందా..? ఊడుతుందా..?
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ నియామక అంశం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రివర్గంలో సభ్యుడిగా ఉండి, ఏ సభలోనూ సభ్యత్వం లేని మహ్మద్ అజారుద్దీన్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఒక క్లిష్ట దశకు చేరుకుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలలలోపు శాసనసభ (MLA) లేదా శాసనమండలి (MLC) సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్ గడువు ఏప్రిల్ ఆఖరుతో ముగుస్తుండటంతో, ఆయన పదవిపై సందిగ్ధత నెలకొంది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అజారుద్దీన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ ప్రక్రియ ప్రారంభం నుంచీ అనేక న్యాయపరమైన, రాజకీయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. మొదట ప్రొఫెసర్ కోదండరాం, అమేర్ అలీఖాన్‌ల పేర్లను గవర్నర్ కోటా కింద సిఫార్సు చేయగా, గత ప్రభుత్వం నియమించిన అభ్యర్థుల తిరస్కరణపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. దీంతో ప్రభుత్వం తన ప్రతిపాదనలను మార్చాల్సి వచ్చింది. రెండోసారి కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేరును ప్రభుత్వం సిఫార్సు చేసింది.
ఇవి కూడా చదవండి

సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నందున గత గవర్నర్ ఈ ఫైల్‌పై నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ, గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని, కోర్టు విచారణ దానికి అడ్డంకి కాదని స్పష్టం చేసింది. దీంతో అజారుద్దీన్ ఎమ్మెల్సీ నియామకం సుగమం అవుతుందని ప్రభుత్వం భావించినా, అప్పటి గవర్నర్ బదిలీ కావడంతో ఫైల్ మళ్లీ పెండింగ్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం కొత్త గవర్నర్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఏప్రిల్ నెలాఖరు లోపు అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతే, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వానికి నైతికంగా ఇబ్బందికరంగా మారుతుంది. ఒకవైపు అజారుద్దీన్ నియామకం పెండింగ్‌లో ఉండగానే, రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా లంబాడా వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చినప్పటికీ అమలు కాకపోవడంతో, బాధితులు హైకోర్టును ఆశ్రయించవచ్చని న్యాయస్థానమే సూచించింది. దీంతో ఈ వ్యవహారం మళ్లీ న్యాయపోరాటంగా మారే అవకాశం ఉంది.
ఒకవేళ గడువులోగా గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోతే, అజారుద్దీన్ తన మంత్రి పదవిని కోల్పోవడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల అనంతరం లేదా ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే ఈ విషయంలో స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








