గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ – జనసేన చెరోదారి!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. అక్కడ ఎన్డీయే కూటమిగా ఘన విజయం సాధించాయి. అయితే సరిహద్దు దాటి తెలంగాణ గడ్డపైకి వచ్చేసరికి బీజేపీ, జనసేన వేర్వేరుగా పని చేస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ తన యాక్టివ్ పాలిటిక్స్ ని బాగా తగ్గించేసింది. దీంతో ఆ పార్టీతో సమస్య లేదు. అయితే బీజేపీ, జనసేన మాత్రం తమదైన శైలిలో పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలూ నేరుగా తలపడేందుకు సిద్ధమయ్యాయి.
ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల స్థానం నుంచి మాజీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ గడల శ్రీనివాసరావును జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా బరిలోకి దించారు. కరోనా సంక్షోభ సమయంలో సమర్థంగా పనిచేసిన వ్యక్తిగా గడలకు పేరుంది. అంతేకాక ఉద్యోగ, యువజన వర్గాల్లో కొంతమేర గుర్తింపు తెచ్చుకున్నారు. గడల అభ్యర్థిత్వానికి మిత్రపక్షమైన బీజేపీ బేషరతుగా మద్దతు ప్రకటిస్తుందని జనసేన నాయకత్వం ఆశించింది. ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా సహకార సూత్రాన్ని అమలు చేయాలనుకుంది. గ్రాడ్యుయేట్ స్థానాల్లో ఒకదానిని తమకు కేటాయిస్తే ఉమ్మడిగా కాంగ్రెస్, బీఆర్ఎస్లను నిలువరించవచ్చని భావించింది.
అయితే.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇందుకు ససేమిరా అంటోంది. జనసేన ప్రతిపాదనను నామమాత్రంగా కూడా పరిగణనలోకి తీసుకోవట్లేదు. చర్చల స్థాయిలోనే ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఏపీలో జనసేనతో ఉన్న పొత్తు బంధం వేరని, తెలంగాణలో తమ స్వతంత్ర రాజకీయ ఉనికిని, కేడర్‌ను తాకట్టు పెట్టేది లేదనే సంకేతాలను కమలనాథులు పంపారు. దీంతో కూటమి ధర్మాన్ని పాటించాల్సింది తాము మాత్రమేనా? అనే అసంతృప్తి జనసేన శ్రేణుల్లో మొదలైంది.
బీజేపీ ఏకపక్ష ధోరణితో రగిలిపోయిన జనసేన తెలంగాణ విభాగం.. రాజకీయంగా తమ బలమేంటో నిరూపించుకోవాలని సిద్ధమైంది. కేవలం వరంగల్- ఖమ్మం- నల్గొండ స్థానానికే పరిమితం కాకుండా, బీజేపీకి కంచుకోటగా పేరొందిన హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానంలోనూ పోటీకి దిగాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ తెలంగాణ వ్యవహారాల సమన్వయకర్త రామ్ తాళ్లూరి సారథ్యంలో ఈ మేరకు కసరత్తు పూర్తి చేసింది. ఇక్కడి నుంచి డాక్టర్ న్యూటన్ను బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యావంతులలో బీసీలు, ఉద్యోగులు, ఐటీ నిపుణులతో పాటు క్రిస్టియన్ మైనార్టీ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. డాక్టర్ న్యూటన్ రాకతో ఈ వర్గాల మద్దతు కూడగట్టవచ్చని పార్టీ భావిస్తోంది. అర్బన్ ఓటర్లలో, ముఖ్యంగా పట్టభద్రులలో పవన్ కల్యాణ్‌కు ఉన్న ప్రజాదరణ తప్పకుండా జనసేనకు కలిసొస్తుందని ఆ పార్టీ నమ్ముతోంది. అదే సమయంలో న్యూటన్ ఎంపిక బీజేపీకి సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. గత అనుభవం, విద్యావంతుల్లో తనకున్న పరిచయాలతో తిరిగి మండలిలో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు. అయితే ఇక్కడ జనసేన కూడా పోటీకి రావడం బీజేపీని కలవరపాటుకు గురిచేస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యతా ఓట్ల విధానంలో జరుగుతాయి. ఇక్కడ ప్రతి మొదటి ప్రాధాన్యత ఓటూ విజయవకాశాలను తారుమారు చేస్తుంది. పట్టణ విద్యావంతులు, యువత, జాతీయవాద భావజాలం ఉన్న ఓట్లే బీజేపీకి సాంప్రదాయ పునాది. ఇప్పుడు జనసేన కూడా సరిగ్గా అదే ఓటు బ్యాంకును ఆకర్షించే సత్తా కలిగి ఉండటంతో.. బీజేపీ సంప్రదాయ ఓట్లు చీలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇది ప్రత్యక్షంగా అధికార కాంగ్రెస్ లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థులకు రాజకీయ లబ్ధి చేకూరుస్తుందన్న ఆందోళన కాషాయ దళంలో మొదలైంది.
ఒకవైపు ఉమ్మడి ఖమ్మం- వరంగల్-నల్గొండ స్థానంలో గడల శ్రీనివాసరావు విస్తృత పర్యటనలు చేస్తూ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. హైదరాబాద్‌లో బీజేపీకి జనసేన అడ్డుకట్ట వేసే స్థాయికి పరిస్థితి చేరింది. ఒకే దేశం.. ఒకే కూటమి అనే నినాదంతో కేంద్రంలోనూ, ఏపీలోనూ కలసి సాగుతున్న బీజేపీ- జనసేనలు.. తెలంగాణకు వచ్చేసరికి ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఒకరి ఓట్లను మరొకరు దెబ్బతీసుకునే ఈ స్నేహపూర్వక శత్రుత్వం అంతిమంగా ఎవరి కొంప ముంచుతుందో, తెలంగాణ పట్టభద్రులు ఎవరి వ్యూహాన్ని సమర్థిస్తారో వేచి చూడాల్సిందే.







