మండలిలో అడుగుపెట్టిన అజారుద్దీన్, కోదండరాం!
తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహ్మద్ అజారుద్దీన్, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్ కోదండరాం ఇవాళ శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి తదితర ప్రముఖులు హాజరై నూతన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.
అజారుద్దీన్, కోదండరాంల ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పూలపాన్పులా సాగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయగా, అప్పటి గవర్నర్ తమిళిసై వారిని తిరస్కరించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అజారుద్దీన్, కోదండరాంలను నామినేట్ చేసింది. దీనిని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించడంతో సుదీర్ఘ న్యాయపోరాటం నడిచింది. నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని పిటిషన్లు దాఖలైనప్పటికీ, అంతిమంగా న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో వీరిద్దరి ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైంది.
ఇవి కూడా చదవండి
అజారుద్దీన్ ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నప్పటికీ, ఆయన ఏ సభలోనూ సభ్యుడిగా లేకపోవడం ఒక సాంకేతిక సమస్యగా మారింది. నిబంధనల ప్రకారం ఆరు నెలల లోపు ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. తాజాగా గవర్నర్ ఆమోదంతో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతో, అజారుద్దీన్ మంత్రి పదవికి ఉన్న గండం తొలగిపోయింది.
ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన అజారుద్దీన్ భావోద్వేగానికి లోనయ్యారు. తన కోసం సీఎం రేవంత్ రెడ్డి చాలా చేశారన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు పొలిటికల్ ఫ్యాన్స్ కంటే క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువని, ఇకపై ప్రజా సేవ ద్వారా పొలిటికల్ ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంటానని అజారుద్దీన్ అన్నారు. మైనారిటీల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని మాటిచ్చారు.
మరోవైపు ప్రొఫెసర్ కోదండరాం తన శైలిలో స్పందించారు. తనకు మంత్రి పదవులపై ఆశ లేదని స్పష్టం చేశారు. చాలా రోజుల తర్వాత వివాదాస్పద సమస్యకు పరిష్కారం లభించిందని, ఎమ్మెల్సీ పదవి అనేది నా లక్ష్యాల సాధనకు ఒక సాధనం మాత్రమేనని కోదండరాం అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యమకారుల సమస్యలు, ఆదివాసుల హక్కుల కోసం మండలి వేదికగా పోరాడతానన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ పునర్నిర్మాణం కోసం పని చేస్తానని చెప్పారు. తన పోరాటం ఆగిపోదని, గతంలో ఎలా ఉన్నానో భవిష్యత్తులో కూడా ప్రజల మనిషిగానే ఉంటానని ఆయన నొక్కి చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి, న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి ఈ ఇద్దరు కీలక నేతలను మండలికి పంపడంలో విజయం సాధించారు. అటు మైనారిటీ వర్గాల మద్దతు కోసం అజారుద్దీన్, ఇటు మేధావులు, ఉద్యమకారుల గళం కోసం కోదండరాం మండలిలో ఉండటం ప్రభుత్వానికి కొత్త బలాన్ని ఇస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








