Chadalavada: ఎమ్మెల్యే చదలవాడ తీరుపై దుమారం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంచి మార్పు రావాలని, పాలన పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్న మాటలు కొందరు ప్రజాప్రతినిధుల చెవికి ఎక్కడం లేదనిపిస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తాజాగా సృష్టించిన హైడ్రామా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తే వ్యవస్థలను శాసించాలని చూడటం చర్చకు దారితీస్తోంది.
మంగళవారం ఉదయం 11:30 గంటలకు పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావును కలిసిన ఎమ్మెల్యే చదలవాడ, తన సిఫార్సు మేరకు రామినేని ప్రసాద్‌ను పోలీసు విభాగానికి లీగల్ అడ్వైజర్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. 8 నెలల క్రితం తాను ఇచ్చిన ప్రతిపాదనను ఎందుకు పెండింగ్‌లో పెట్టారని ఆయన ప్రశ్నించారు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేసినా, ఎమ్మెల్యే మాత్రం శాంతించలేదు. “నియామక పత్రం ఇప్పుడే ఇవ్వాలి.. లేదంటే కదిలేది లేదు” అంటూ ఎస్పీ ఛాంబర్‌లోనే భీష్మించుకు కూర్చున్నారు.
ఈ నిరసన కేవలం కూర్చోవడానికే పరిమితం కాలేదు. సాయంత్రం అవుతున్నా ఎమ్మెల్యే పట్టు వీడకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రులు నారా లోకేశ్, అనిత కార్యాలయాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా ఆయన స్పందించలేదు. ఒకానొక దశలో ఎమ్మెల్యే ఎస్పీ ఛాంబర్లోని బాత్రూంలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకోవడంతో పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది. చివరకు పోలీసులు డంబెల్స్‌తో బాత్రూం డోర్ పగలగొట్టి ఆయన్ను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. రాత్రి 9:45 గంటల వరకు అంటే దాదాపు 10 గంటల పాటు ఈ ఉత్కంఠ కొనసాగింది.
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్యే అరవింద బాబు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. ఎస్పీ కార్యాలయానికి వెళ్లకముందే ఆర్డీవో ఆఫీసులో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం కోసం గంటపాటు ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో విజయవాడలోని ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయంలో కూడా ఆయన ఇలాగే ప్రవర్తించి వివాదాలకు కేంద్రబిందువయ్యారు.
సొంత మనుషులకు పదవులు ఇప్పించుకోవడం కోసం ప్రభుత్వ కార్యాలయాలను వేదికగా చేసుకోవడం, అధికారులను ఇబ్బంది పెట్టడంపై ఇప్పటికే టీడీపీ అధిష్ఠానం ఆయన నుంచి వివరణ కోరింది. అయినప్పటికీ ఎమ్మెల్యే తీరులో మార్పు రాకపోవడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు “ప్రజల కోసం పని చేయండి, అధికారులతో సమన్వయం పాటించండి” అని హెచ్చరిస్తున్నా, కొందరు ఎమ్మెల్యేలు అస్సలు చెవికి ఎక్కించుకోవడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థలపై ఒత్తిడి తేవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసిపోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పల్నాడు లాంటి సున్నితమైన జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి ఇలా ఎస్పీ కార్యాలయంలోనే ధర్నాకు దిగడం పోలీసుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.
చివరకు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి మధ్యవర్తిత్వంతో, బుధవారం సాయంత్రం లోపు నిర్ణయం ప్రకటిస్తామన్న హామీతో ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. కానీ, అధిష్ఠానం ఈసారి అరవింద బాబుపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. అధికారులను బెదిరించే ధోరణి కొనసాగితే, ‘ఇది మంచి ప్రభుత్వం’ అన్న నినాదానికే చేటు తెచ్చే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండి








