Ram Mohan Naidu: ప్రజా రాజధానిగా అమరావతి చరిత్రలో నిలుస్తుంది: రామ్మోహన్నాయుడు
Ram Mohan Naidu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చకు చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ అనుమతించగా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రసంగం చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.
విభజన కష్టాలు :
రాష్ట్ర విభజన జరిగిన తీరును రామ్మోహన్ నాయుడు తప్పుబట్టారు. ఒక రాష్ట్రానికి రాజధాని ఉండి, మరో రాష్ట్రానికి రాజధాని లేకుండా వదిలేయడం వల్ల సమస్యలు మొదలయ్యాయని పేర్కొన్నారు. గతంలో వాజ్పేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజన ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగిందని, కానీ ఏపీ విభజన సమయంలో సరైన విధానం అనుసరించలేదని విమర్శించారు. విభజన సమయంలో ఏపీకి రూ. 16 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుని ముందుకు సాగారని గుర్తు చేశారు.
రైతుల త్యాగం:
రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, కానీ గత వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో నాటకమాడిందని విమర్శించారు. అమరావతి కోసం ఉద్యమించిన రైతులను, మహిళలను లాఠీలతో కొట్టించి తీవ్రంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం పోరాడిన అమరావతి మహిళలకు ఈ సందర్భంగా ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు.
వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి:
చరిత్రలో గొప్ప నగరాలన్నీ నదీ తీరాల్లోనే విలసిల్లాయని, అదే క్రమంలో కృష్ణా నది తీరాన అమరావతిని నిర్మించాలని నిర్ణయించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2014లోనే అసెంబ్లీలో అమరావతిపై ఏకగ్రీవ తీర్మానం జరిగిందని గుర్తు చేస్తూ.. రాబోయే రోజుల్లో అమరావతిని ఒక ఐకానిక్, వరల్డ్ క్లాస్ రాజధానిగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.







