YCP: రాజధానిపై వైసీపీ పునరాలోచించాలా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘రాజధాని‘ అంశం ఒక తీరని రావణకాష్టంలా మారింది. తాజాగా పార్లమెంటులో అమరావతి బిల్లుపై జరిగిన చర్చ, ఆ సందర్భంగా తలెత్తిన రాజకీయ సమీకరణాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)ని ఇబ్బందుల్లో పడేశాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ పంతాలే ప్రాధాన్యతగా మారుతున్నాయా అన్న విమర్శలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, మడమ తిప్పని పార్టీ అని చెప్పుకునే పార్టీ, అత్యంత కీలకమైన రాజధాని విషయంలో ఎందుకు ఏకాకిగా మిగిలిపోవాల్సి వచ్చిందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశం.
అమరావతికి మద్దతుగా పార్లమెంటులో బిల్లు వచ్చినప్పుడు వైసీపీ మినహా దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలపడం గమనార్హం. ఇందులో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేకపోయినా, వైసీపీతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన భారత్ రాష్ట్ర సమితి (BRS) సైతం అమరావతికి జై కొట్టడం వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ. పొరుగు రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ సైతం ఏపీ రాజధానిగా అమరావతి ఆవశ్యకతను గుర్తించినప్పుడు, సొంత రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వైసీపీ ఎందుకు వెనకడుగు వేస్తోందనే ప్రశ్న తలెత్తుతోంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గత ఐదేళ్లలో దాదాపు అన్ని బిల్లులపై వైసీపీ బేషరతుగా మద్దతు ఇస్తూ వచ్చింది. మరి అదే బీజేపీ అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరితో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎందుకు కలిసి రాలేకపోయింది? ఇది పార్టీ చేసిన ఒక చారిత్రాత్మక తప్పిదంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వైసీపీ ప్రస్థానాన్ని గమనిస్తే రాజధాని విషయంలో స్పష్టత కంటే గందరగోళమే ఎక్కువగా కనిపిస్తోంది. 2014-19 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా అంగీకరించి, అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలపింది. 2019లో అధికారంలోకి రాగానే మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. కోర్టు మొట్టికాయలతో బిల్లును వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ మూడు రాజధానులను పక్కన పెట్టి ‘మావిగన్’ (MaViGun) వంటి కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది.
మడమ తిప్పను, మాట తప్పను అని చెప్పుకునే పార్టీ, ఒకే అంశంపై ఇన్ని సార్లు వైఖరి మార్చుకోవడం కేడర్‌ను సైతం అయోమయానికి గురిచేస్తోంది. గత ఎన్నికల్లో ప్రజలు మూడు రాజధానుల ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించినప్పటికీ, ఆ తీర్పు నుండి పాఠాలు నేర్చుకోవడంలో వైసీపీ విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం సహజం. కానీ ఆ రాజకీయం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టేలా ఉండకూడదు. రాజధాని అనేది కేవలం భవనాల సముదాయం కాదు, అది ఒక రాష్ట్ర ఆర్థిక నాడి. ఇతర పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చినప్పుడు, కనీసం మిత్రపక్షంగా భావించే బిఆర్ఎస్ మద్దతు ఇచ్చినప్పుడైనా వైసీపీ పునరాలోచించి ఉంటే బాగుండేది. కేవలం తమకు నచ్చని పార్టీ తెచ్చిన ప్రతిపాదన కాబట్టి వ్యతిరేకించాలనే ధోరణి పార్టీకి, రాష్ట్రానికి నష్టం చేకూరుస్తోంది.
రాజధానిపై పట్టువిడుపులు లేని వైఖరి వైసీపీని రాజకీయంగా ఒంటరిని చేస్తోంది. ప్రజా తీర్పును గౌరవిస్తూ, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలను గమనిస్తూ అమరావతి విషయంలో పార్టీ తన సిద్ధాంతాలను సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా గందరగోళం వీడి, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే దిశగా వైసీపీ అడుగులు వేయకపోతే, భవిష్యత్తులో ప్రజలకు సమాధానం చెప్పుకోవడం కష్టతరం కావచ్చు. రాజకీయం గెలవాలి.. కానీ అది రాష్ట్ర ప్రజల హితం కోసమే కావాలి.
ఇవి కూడా చదవండి








