YCP: అమరావతిపై వైసీపీ చారిత్రాత్మక తప్పిదం?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ‘రాజధాని‘ అంశం మరోసారి చిచ్చురేపుతోంది. నిన్న లోక్సభ, నేడు రాజ్యసభ వేదికగా అమరావతికి శాశ్వత రాజధాని హోదా కల్పించే బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తీవ్రంగా వ్యతిరేకించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బిల్లును వ్యతిరేకించడమే కాకుండా, సభ నుంచి వాకౌట్ చేయడం ద్వారా అమరావతి పట్ల తమ వైఖరి ఏంటో ఆ పార్టీ కుండబద్దలు కొట్టింది. అయితే, బయట మాత్రం తాము అమరావతికి వ్యతిరేకం కాదని చెబుతూనే, పార్లమెంట్లో దానికి చట్టబద్ధతనిచ్చే ప్రక్రియను అడ్డుకోవడం వైసీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజ్యాంగంలో ‘రాజధాని’ అనే పదమే లేదని, రాష్ట్రాలకు రాజధానిని నిర్ణయించే అధికారం కేంద్రానికి లేదని వైసీపీ ఎంపీలు వాదిస్తున్నారు. విచిత్రమేమిటంటే, ఒకవైపు ఈ సాంకేతిక అంశాలను తెరపైకి తెస్తూనే, మరోవైపు ‘మావిగన్’ పేరుతో సరికొత్త రాజధాని ప్రతిపాదనను జగన్ మోహన్ రెడ్డి తెరపైకి తీసుకురావడం గమనార్హం. గతంలో ‘మూడు రాజధానుల’ నినాదంతో ప్రజల ముందుకు వెళ్లిన వైసీపీకి, గత ఎన్నికల్లో ప్రజలు కోలుకోలేని దెబ్బ తీశారు. మూడు ప్రాంతాల్లోనూ ఆ పార్టీ తిరస్కరణకు గురై కేవలం 11 సీట్లకు పరిమితమైనా, ఇప్పటికీ ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో ఆ పార్టీ విఫలమవుతోందనేది స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి
అమరావతిలో భారీ అవినీతి జరిగిందని, రైతులకు ప్లాట్లు ఇవ్వలేదని వైసీపీ రకరకాల కారణాలను సాకులుగా చూపుతోంది. అయితే ఇక్కడే ఒక కీలక ప్రశ్న తలెత్తుతోంది. గత ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీ, అక్కడ అవినీతి జరిగి ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? రైతులకు ప్లాట్లు అప్పగించే బాధ్యతను ఎందుకు విస్మరించింది? అధికారంలో ఉన్నప్పుడు ఆ సమస్యలను పరిష్కరించకుండా, ఇప్పుడు అవే సాకులతో రాజధాని ఏర్పాటును అడ్డుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది.
జాతీయ రాజకీయాల్లో ఈ బిల్లుకు అనూహ్య మద్దతు లభించింది. ఇండియా కూటమితో పాటు పలు ప్రాంతీయ పార్టీలు అమరావతికి మద్దతుగా నిలిచాయి. దేశమంతా ఏపీ రాజధానిగా అమరావతి వైపు మొగ్గు చూపుతుంటే, సొంత రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ మాత్రం వ్యతిరేకించడం విచారకరం. రాజధానిని అనిశ్చితిలో ఉంచడం ద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చనేది ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. కానీ, ఈ అనిశ్చితి రాష్ట్ర అభివృద్ధిని దశాబ్దాల కాలం వెనక్కి నెడుతుందనే నిజాన్ని వైసీపీ విస్మరిస్తోంది.
రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు, వ్యూహాలు ఉండటం సహజం. కానీ, అవి రాష్ట్ర ప్రయోజనాలకు, ప్రజాకాంక్షకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పటికే ఒకసారి ప్రజలు తమ తీర్పు ద్వారా హెచ్చరించినా, వైసీపీ ఇంకా పాత ధోరణిలోనే పయనించడం ‘చారిత్రాత్మక తప్పిదం’ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రానికి ఏది మేలు అనే కోణంలో కాకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకుంటే.. భవిష్యత్తులో ఆ పార్టీ మరింత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అమరావతి విషయంలో వైసీపీ అనుసరిస్తున్న ఈ గందరగోళ వైఖరి చివరకు ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి








