(K)Amaravati : అమరావతా..? కమ్మరావతా..?
అమరావతి రాజధాని అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ అంతర్లీనంగా ఉండే కుల సమీకరణాలను ఈ వ్యాఖ్యలు మరోసారి బహిర్గతం చేశాయి.
రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై జరిగిన చర్చలో రేణుకా చౌదరి మాట్లాడారు. “అమరావతికి ఆ పేరు పెట్టమని నేనే అప్పటి ముఖ్యమంత్రికి చెప్పాను. లేకపోతే దానికి ‘కమ్మరావతి’ అని పిలవమన్నాను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక పవిత్రమైన చట్టసభలో ఒక నగరాన్ని నిర్దిష్ట కులానికి ఆపాదిస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఇతర వర్గాలను ఏకం చేయడం అనేది ఒక ప్రధాన వ్యూహంగా ఉంది. గతంలో వైఎస్ జగన్ కూడా అమరావతిని కేవలం ఒక కులానికి చెందిన ప్రాంతంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు కొందరు అది కమరావతి అనే విమర్శిస్తుంటారు. ఇప్పుడు రేణుకా చౌదరి వ్యాఖ్యలు కూడా వైసీపీ విమర్శలకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. అమరావతిని “మా కమ్మ రాజధాని” అన్నట్లుగా ఆమె గర్వంగా చెప్పుకోవడం, ఆ ప్రాంతంపై ఉన్న అపోహలను నిజం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అయితే.. ఇక్కడో విషయం గ్రహించాలి. ఏ నగరమైనా లేదా ఏ ప్రాంతమైనా ఒకే కులానికి పరిమితం కాదు. నగరాల్లో కొన్ని ప్రాంతాల్లో నిర్దిష్ట సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్లోని పాతబస్తీలో ముస్లింలు, జూబ్లీహిల్స్ లేదా కూకట్పల్లిలో కమ్మ వారు ఎక్కువగా ఉండవచ్చు. అంత మాత్రాన ఆ ప్రాంతాలను ఆ కులాల పేర్లతో పిలవలేము. అమరావతిలో 29 గ్రామాలున్నాయి. అది తాడికొండ నియోజకవర్గం పరిధిలో ఉంది. అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉన్నప్పుడు, దానికి కులం రంగు పులమడం సమంజసం కాదు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న ప్రధాన లోపం ఏమిటంటే, ఒక్కొక్క కులం ఒక్కొక్క పార్టీని తమ సొంత పార్టీగా భావించడం. దాదాపు 80 శాతం మంది కమ్మ సామాజిక వర్గం వారు తెలుగుదేశం పార్టీని తమదిగా భావిస్తారు. రెడ్డి సామాజిక వర్గం వైఎస్సార్ కాంగ్రెస్ను ఓన్ చేసుకుంది. కాపు సామాజిక వర్గం జనసేనను తమ పార్టీగా చూస్తోంది. ఈ తరహా రాజకీయాలు సమాజానికి ప్రమాదకరం.
రేణుకా చౌదరి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో ఆమె స్పష్టం చేయాల్సి ఉంది. అది గత ప్రభుత్వానికి ఇచ్చిన సలహాగా చెప్పారా లేక గర్వంగా చెప్పారా అనేది పక్కన పెడితే, చట్టసభల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్లమెంటరీ గౌరవానికి విరుద్ధం. కమ్మ సామాజిక వర్గంలో అనేక మంది సంస్కర్తలు, కమ్యూనిస్ట్ నేతలు, త్యాగధనులు ఉన్నారు. అమరావతిని ఒక అంతర్జాతీయ నగరంగా నిర్మించాలనే ఆకాంక్షను ఇలా కుల రాజకీయాల్లోకి లాగడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు.
ఇవి కూడా చదవండి








