Amaravati: అమరావతిని నాశనం చేయాలని చూసిన వారికి.. శాసనంతో సమాధానం చెప్పాం – సీఎం
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక బిల్లుకు దక్కిన గుర్తింపు మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవమని ఆయన అభివర్ణించారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని, హోంమంత్రికి ధన్యవాదాలు:
అమరావతి బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్లకు సీఎం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వైకాపా మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపడం ముదావహమన్నారు.
ఇవి కూడా చదవండి
వైకాపాపై విమర్శలు:
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైకాపా నేతలు ద్రోహం చేశారని చంద్రబాబు విమర్శించారు. దేశంలోని అన్ని పార్టీలు ఒకవైపు ఉంటే, వైకాపా మాత్రం పంతాలకు పోయి రాష్ట్ర నాశనానికి పూనుకుందని మండిపడ్డారు. అమరావతిని దెబ్బతీయాలని చూసిన వారికి ఈ చట్టబద్ధతే సరైన సమాధానమని ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం:
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడూ అభివృద్ధి వికేంద్రీకరణేనని సీఎం స్పష్టం చేశారు. విభజన సమయంలో రాజధాని లేక పడిన ఇబ్బందులను గుర్తుచేస్తూ.. బస్సులే క్యాంపు కార్యాలయాలుగా పాలన సాగించామని గుర్తుచేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరికీ అందుబాటులో ఉండేలా మధ్యలో రాజధానిని నిర్ణయించామని చెప్పారు.
తెలంగాణపై సానుకూలత:
తాను ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలుగు జాతి గౌరవం పెంచేందుకే హైదరాబాద్లో సైబరాబాద్, హైటెక్ సిటీ వంటివి నిర్మించానని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు దృష్ట్యా 7 మండలాలను ఏపీలో విలీనం చేయించడంలో తన పట్టుదలను వివరించారు. రెండు రాష్ట్రాల ప్రజల మేలు కోసమే తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
ఇవి కూడా చదవండి








