Kadapa: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్య చావుకు భర్త ‘డైరెక్షన్’!
Rajampet: మనుషుల మధ్యన మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయో చెప్పడానికి కడప(Kadapa) జిల్లా రాజంపేటలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. భార్య కళ్లెదుటే ప్రాణాలు తీసుకుంటుంటే కాపాడాల్సిన భర్త, రాక్షసంగా వ్యవహరించి ఆమె చావును మొబైల్లో రికార్డు చేసిన ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కుటుంబ కలహాలే కారణం:
రాజంపేట మండలం బోయనపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ రైల్వేలో లోకో పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి కృష్ణవేణితో వివాహం కాగా, వీరి మధ్య కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఇంట్లోనే ఉరివేసుకునేందుకు సిద్ధపడింది.
ఇవి కూడా చదవండి
అడ్డుకోకపోగా.. సలహాలిస్తూ వీడియో:
భార్య ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన శ్రీనివాస్, ఆమెను అడ్డుకుని ప్రాణాలు కాపాడాల్సింది పోయి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కృష్ణవేణి ఉరితాడు వేసుకుంటుండగా తన ఫోన్లో వీడియో తీయడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా “ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి” అంటూ ఆమెకు సూచనలు చేస్తూ క్రూరంగా ప్రవర్తించాడు. భర్త ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కృష్ణవేణి ఉరికి వేలాడి ప్రాణాలు విడిచింది.
పోలీసుల అదుపులో నిందితుడు:
ఈ విషయం వెలుగులోకి రావడంతో మృతురాలి బంధువులు శ్రీనివాస్‌పై ఆగ్రహంతో దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణవేణి మృతికి భర్త నిర్లక్ష్యం, వికృత ప్రవర్తనే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.







